మద్యానికి బానిసై ఒకరి మృతి
నిజామాబాద్ అర్బన్: నగరంలో రెండో టౌన్ పీఎస్ పరిధిలో కూలి పనులు చేసే ఇట్టికుమార్ (36) అనే వ్యక్తి మద్యానికి బానిసై మృతిచెందినట్లు ఎస్సై యాదగిరి గురువారం తెలిపారు. అధికంగా మద్యం సేవించడం వల్లే మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పాముకాటుతో యువకుడు..
బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో పాముకాటుకు గురైన ఓ యువకుడు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జానకంపేట గ్రామానికి చెందిన పోచమ్మల సాయిలు(34)తన పూరి గుడిసెలో నిద్రిస్తుండగా మంగళవారం రాత్రి పాము కాటు వేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను జిల్లా ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు
నిజామాబాద్ అర్బన్: నగరంలోని సాయినగర్‌లో గురువారం సాయంత్రం పిచ్చికుక్క చిన్నారులపై తీవ్రంగా గాయపరిచింది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారులపై అకస్మాతుగా వచ్చి దాడిచేసింది. చిన్నారులు అశ్విత, మనస్విలకు తీవ్రగాయాలు కాగా మరో బాలికకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, కుటుంబీకులు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. కాలనీలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని స్థానిక కార్పొరేటర్‌కు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని చిన్నారుల తల్లిదండ్రులు పేర్కొన్నారు. అధికారులు స్పందించి కాలనీలో నెలకొన్న కుక్కల సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.


