తొమ్మిది నాటుతుపాకులు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

తొమ్మిది నాటుతుపాకులు సీజ్‌

Jul 17 2026 3:58 AM | Updated on Jul 17 2026 3:58 AM

దేవక్కపేట అటవీ ప్రాంతంలో

పట్టుబడిన నిందితులు

మొత్తం 10 మంది అరెస్ట్‌, రిమాండ్‌

నిజామాబాద్‌ అర్బన్‌ : భీమ్‌గల్‌ మండలం దేవక్కపేట అటవీ ప్రాంతంలో తొమ్మిది నాటుతుపాకులను స్వాధీనం చేసుకొని, పది మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. దేవక్కపేట శివారులో ఈ నెల 16వ తేదీన అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా తొమ్మిది నాటుతుపాకులు లభించాయన్నారు. నిందితులు అడవి జంతువులు, ఇతర వన్యప్రాణులను వేటాడేందుకు వాటిని ఉపయోగించడం జరిగిందన్నారు. తొమ్మిది మంది నిందితుల్లో భూక్యా రఘుపతి, కార్ల అంజయ్య, ముదావత్‌ తిరుపతి, భూక్యా చందర్‌, ముర్రి గంగనర్సయ్య, అనిమేని లింబాద్రి, మలావత్‌ కుంభ, బానావత్‌ గంగారెడ్డి, మలావత్‌ దారిసింగ్‌, ఆకునూర్‌ రాజు(ఆయుధాలు రిపేర్‌ చేసిన వ్యక్తి)ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

చిరుతలను వేటాడిన కేసుల్లో..

జిల్లాలోని భీమ్‌గల్‌ మండలం కారేపల్లి సౌత్‌ బీట్‌ పరిధిలోని 79 కంపార్టమెంట్‌లో, ఇందల్‌వాయి రేంజ్‌ పరిధిలోని అన్సాన్‌పల్లి బీట్‌ పరిధిలో చిరుతలను వేటాడిన ఘటనల్లో నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య వెల్లడించారు. వివరాలు.. కారేపల్లి సౌత్‌ బీట్‌లో భీమ్‌గల్‌ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మలావత్‌ సంజీవ్‌, దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు చిరుత పులిని చంపారన్నారు. మేకల కాపరి అయిన సంజీవ్‌ నెల రోజుల కిందట మేత కోసం జీవాల మందను కారేపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లగా, ఓ మేకను చిరుత వేటాడి హతమార్చింది. అదే మేక కళేబరంలోకి గడ్డి మందు ఇంజెక్ట్‌ చేసి ఇద్దరూ కలిసి చిరుతను హతమార్చారు. అనంతరం మరో నలుగురితో కలిసి చిరుత కళేబరాన్ని దాచిపెట్టి కొనుగోలు దారుడు దొరికిన తరువాత తీసి అమ్ముకుందామని నిర్ణయించుకున్నారు. చిరుత కళేబరాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టగా, విచారణలో సిరిసిల్ల రాములు ఇంట్లో నాటుతుపాకీ లభించింది. రాములుతోపాటు సంజీవ్‌ను అరెస్టు చేయగా, మరో నలుగురు పరారీలో ఉన్నారు.

అలాగే అన్సాన్‌పల్లి బీట్‌ పరిధిలో మూడు నెలల కిందట చిరుతను వేటాడి చంపిన ఘటనను పోలీసులు ఛేదించారు. అటవీ అధికారుల సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అడవి పందుల వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కుకోగా, కొందరు వ్యక్తులు దానిని కర్రలతో కొట్టి చంపారు. చిరుత కళేబరాన్ని ధర్పల్లి శివారులోని ఓ మామిడితోటకు తరలించి దాని చర్మాన్ని ఒలిచి నాలుగు పంజాలను వేరుచేసి మిగిలిన శరీర భాగాలను సమీపంలోని బావిలో పారేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు.

చిరుతలను వేటాడిన వ్యక్తులను గుర్తించేందుకు పక్కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మరికొంత మంది నాటు తుపాకులతో పట్టుబడ్డారు. అలాగే భీమ్‌గల్‌ మండలం కారేపల్లి సౌత్‌బీట్‌, ఇందల్‌వాయి రేంజ్‌లోని అన్సాన్‌పల్లి బీట్‌ పరిధిలో చిరుతను హతమార్చిన దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, తెలంగాణ అటవీ చట్టం తదితర నిబంధనల మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement