వేగంగా వీవో భవనాలు.. | - | Sakshi
Sakshi News home page

వేగంగా వీవో భవనాలు..

Jul 17 2026 3:58 AM | Updated on Jul 17 2026 3:58 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకం (వీబీ జీ రామ్‌ జీ) కింద జిల్లాకు మంజూరు చేసిన (వీవో) గ్రామ సమాఖ్య మహిళా భవన నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరు నాటికి అన్నింటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు కలిసి పని చేస్తున్నాయి. డిసెంబర్‌ నెలలో ఎట్టి పరిస్థితిలోనూ నూతన భవనాల్లోకి వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. గ్రామాల్లోని మహిళా సంఘాలు కలిసి సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం జిల్లాకు మొత్తం 351 వీవో భవనాలను ఐదు నెలల కిందట మంజూరు చేసి ఒక్కోదానికి రూ.10 లక్షలు కేటాయించింది. ఆయా గ్రామాల్లో స్థలాలు కూడా దొరకడంతో స్థానిక సర్పంచులు, సంబంధిత అధికారులు కలిసి పనులు ప్రారంభించారు. అయితే, వీటి నిర్మాణ బాధ్యతలు పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖకు అప్పగించారు. పాత కాంట్రాక్టర్లను, స్థానిక సర్పంచులను ఎలాగోల ఒప్పించి నిర్మాణ పనులను మొదలు పెట్టించారు. ఇప్పటికే జిల్లాలో పొతంగల్‌ మండలం కల్లూర్‌లో వీవో భవనం అన్ని హంగులతో పూర్తయి అందుబాటులోకి వచ్చింది. ఇంకా 350 భవనాల్లో 292 పనులు పురోగతిలో ఉండగా, 200 వరకు సైట్లు స్లాబ్‌ లెవల్‌ వరకు వచ్చాయి. మిగతా చోట్ల వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. అయితే, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సైతం వీవో భవనాల పనులపై ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ భవనాలు పూర్తయితే గ్రామాల్లో మహిళా సంఘాలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి చక్కని వేదికగా మారనున్నాయి.

ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నాం

మంజూరైన గ్రామ సమాఖ్య భవనాలను త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పీఆర్‌ ఇంజినీరింగ్‌ శాఖతో కలిసి పని చేస్తున్నాం. పనుల పురోగతిని తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నాం. పనులు నెమ్మదించిన చోట వేగవంతం చేయిస్తున్నాం.

– సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్‌

నవంబర్‌ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం

పొతంగల్‌ మండలం కల్లూర్‌లో

అందుబాటులోకి వచ్చిన భవనం

పురోగతిలో 292 భవనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement