డొంకేశ్వర్(ఆర్మూర్): ఆహ్లాదాన్ని పంచే ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని కొందరు పర్యాటకులు తమ బాధ్యతారాహిత్యంతో పాడుచేస్తున్నారు. కనీస ‘చిత్తశుద్ధి’ లేకుండా ప్రకృతిని కలుషితం చేస్తూ పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. అటవీ అధికారులు, పోలీసులు అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడం లేదు.
వారాంతంలోనే..
డొంకేశ్వర్ మండలం జీజీ నడ్కుడ, చిన్నయానం బ్యాక్‌వాటర్ ప్రాంతం పచ్చికబయళ్లు తేలి ఆహ్లాదకరంగా మారడంతో వీకెండ్ వస్తే చాలు వందల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఆనందంగా గడుపుతూనే వారు తెచ్చుకున్న ప్లాస్టిక్ కవర్లు, తినుబండారాల ప్యాకెట్లు, వినియోగించిన విస్తార్లు, వాటర్ బాటిళ్లను ఇష్టానుసారంగా పడేసి వెళ్తుతున్నారు. పచ్చని ప్రకృతిని కాస్త ప్లాస్టిక్‌తో నింపేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా బహిరంగంగా మద్యం సేవించి, ఆ సీసాలను నీటి అంచున, పచ్చని బయళ్లలో విసిరికొడుతున్నారు. ఎక్కడ చూసినా పగిలిన గాజు పెంకులే దర్శనమిస్తుండడంతో తోటి పర్యాటకులకు, స్థానికులకు, మేతకు వచ్చే పశువులకు ఇబ్బందిగా మారింది.
కొంతమంది యువకులు తాగిన సీసాలను పగులగొట్టడం, మత్తులో ప్రాజెక్టు నీటిలోకి వెళ్లి ప్రమాదకర ఆటలాడుతున్నారు. మద్యం మత్తులో నీట ముగిని ప్రాణాలు పోయే ప్రమాదముంది. అలాగే ఇటీవల తోటి పర్యాటకులతో పలు గొడవలు కూడా జరిగాయి. యువకులు, పర్యాటకులకు కనీస బాధ్యత లేకపోగా, ఇక్కడ పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. అయితే, ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతం ఎకో టూరిజంకు ఎంపిక కాగా ఇక్కడ ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. కాటేజీలు, రిసార్ట్‌లు ఏర్పాటైతే సిబ్బంది పర్యవేక్షణ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం ఖాళీ బాటిళ్లను కూడా నియంత్రించవచ్చు.
చిన్నయానం వద్ద ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌లో పర్యాటకులు వదిలి వెళ్లిన ప్లాస్టిక్ వ్యర్థాలు , నీటి మధ్యలోకి వెళ్లిన పర్యాటకులు
ఎస్సారెస్పీ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్న పర్యాటకులు
పచ్చని ప్రకృతిలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను పారవేస్తున్న వైనం
పట్టించుకోని అధికారులు


