● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్: ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీ సుదర్శన్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా విద్యాశాఖ పనితీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రభుత్వ సలహాదారు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాల నిర్వహణ తీరుతెన్నులు, సాధించిన ఫలితాలు, మౌలిక సదుపాయాల స్థితిగతులు తదితర అంశాలపై సమీక్ష జరిపి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విద్యా రంగానికి సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. పీఎంశ్రీ పాఠశాలల్లో పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. విద్యా రంగంలో నిజామాబాద్ జిల్లా పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులు ప్రవేశాల విషయంలో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఐదవ స్థానంలో ఉందని, ఈ నెలాఖరు వరకు లక్ష్యానికి అనుగుణంగా ప్రవేశాలు పూర్తి చేసి జిల్లాను ముందంజలో నిలుపుతామని తెలిపారు. ఎస్సెస్సీలో టాపర్లుగా నిలిచిన లహరిక, సౌజన్య, సంజన, లాస్య, అభిజ్ఞ పలువురు విద్యార్థులను జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో నగదు ప్రోత్సా హం అందించి సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, అ దనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, రాష్ట్ర గౌడ సంక్షేమ సంఘం చైర్మన్ శేఖర్ గౌడ్, డీఈవో అశోక్, డీఆర్‌డీవో సాయాగౌడ్, విద్యా శాఖ అధికారులు, ఆర్‌సీవోలు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
సర్ సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలి
బోధన్: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నియోజకవర్గ స్థాయి డివిజన్, మండల అధికారులతో సర్ సర్వే ప్రక్రియ పురోగతి పై సమీక్షించారు. మండలాల వారీగా సర్వే ప్రక్రియలో భాగంగా ఓటర్ల డిజిటలైజేషన్ పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, సిబ్బంది బీఎల్‌వోలతో సమన్వయంతో పని చేయాలని తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మశరత్‌రెడ్డి, ఆర్డీవో విజయకుమారి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, వివిధ శాఖల డివిజన్, మండలాల అధికారులు పాల్గొన్నారు.


