దూసుకొచ్చిన మృత్యువు | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Jul 16 2026 5:36 AM | Updated on Jul 16 2026 5:36 AM

దూసుకొచ్చిన మృత్యువు

నిజాంసాగర్‌(జుక్కల్‌): బంధువు దశ దినకర్మకు అవసరమైన సామగ్రి తెచ్చేందుకు వెళ్లిన ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం ఒడ్డేపల్లి గ్రామ శివారులో బుధవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు వరుసకు బావబావమరుదులు. వివరాలిలా ఉన్నాయి. నిజాంసాగర్‌ మండలం గోర్గల్‌ గ్రామానికి చెందిన జుంజురి దినేశ్‌ (25) హైదరాబాద్‌లో కారు మెకానిక్‌గా, జుంజురి రమేశ్‌ (27) నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నారు. రమేశ్‌ మేనమామ శివయ్య ఇటీవల మరణించారు. ఆయన దశదిన కర్మకు సంబంధించి కూరగాయలతోపాటు శివయ్య ఫొటో ప్రేం కోసం రమేశ్‌, దినేశ్‌ కలిసి బుధవారం బైక్‌పై పిట్లం వెళ్లారు. తిరిగి వస్తుండగా ఒడ్డేపల్లి గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌ నడుపుతున్న దినేశ్‌ అక్కడికక్కడే ప్రాణాలొదలగా, వెనకాల కూర్చున్న రమేశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ఆ మార్గంలో ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు తన వాహనాన్ని ఆపి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు.

కల నెరవేరకుండానే..

గోర్గల్‌ గ్రామానికి చెందిన జుంజురి లచ్చవ్వ, దుర్గయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కొడుకు దినేశ్‌కు 14 నెలల క్రితం వెల్గనూర్‌కు చెందిన రమ్యతో వివాహమైంది. రమ్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. గోర్గల్‌ గ్రామానికి చెందిన జుంజురి అంబవ్వ, సంజీవు దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు రమేశ్‌. పిట్లం మండలం సిద్దాపూర్‌ గ్రామానికి చెందిన సుగుణతో రమేశ్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం సుగుణ ఎనిమిది నెలల గర్భిణి. ఇద్దరు యువకుల భార్యలు గర్భిణులు కావడంతో.. త్వరలోనే తమ సంతానాన్ని చూసుకుంటామనే కల తీరకుండానే రోడ్డు ప్రమాదంలో మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరు యువకుల దుర్మరణం

బంధువు దశ దినకర్మ

సామగ్రి తెస్తుండగా ఘటన

గోర్గల్‌ గ్రామంలో తీవ్ర విషాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement