ప్రమాదవశాత్తు ఒకరి మృతి
మాక్లూర్: మండలంలోని ముల్లంగి(బి) శివారులో బుధవారం సాయంత్రం దమ్ము చేసిన పంట పొలంలో ఒకరు మృతిచెందారు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. ముల్లంగి(బి) గ్రామానికి చెందిన బట్టు గంగాధర్(40) తన పొలంతో పాటు ఇతరుల వ్యవసాయ భూమి కౌలుకు చేస్తాడు. ఉదయం పొలం పనులకు వెళ్లిన అతను రాత్రి అయినా తిరిగిరాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించారు. దమ్ము చేసిన పొలంలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
డిచ్‌పల్లి: డిచ్‌పల్లిలోని తెయూ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో దోర్నాల భరత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డిచ్‌పల్లి ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలూరు గ్రామానికి చెందిన భరత్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తెయూ డిగ్రీ వన్‌టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ పరీక్షల్లో భాగంగా వారం రోజుల క్రితం డిచ్‌పల్లికి వచ్చి వారి బంధువుల వద్ద ఉంటూ పరీక్షలు రాస్తున్నాడు. బుధవారం పరీక్ష రాసిన తర్వాత యూనివర్సిటీకి నుంచి డిచ్‌పల్లికి బైక్ పై వస్తుండగా లారీ ఢీకొన్నది. అదే సమయంలో తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్న ఎస్సై ఆరీఫ్ వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కోస్లీ శివారులో కూలీలకు ..
నవీపేట: మండలంలోని కోస్లీ గ్రామ శివారులో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కోస్లి శివారులో వరి నాట్లు వేసేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి కూలీలు వలస వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామానికి చెందిన డాంగె రాజబాబు వ్యవసాయ పొలంలో వరి నాట్లు వేసేందుకు వచ్చిన కూలీలు తిరుగు ప్రయాణంలో వాహనం అదుపుతప్పి మార్గమధ్యలో బోల్తా కొట్టిందన్నారు. రాజబాబు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. రాజబాబుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


