● జైల్లో పరిచయమైన వ్యక్తి ఇంటికి
వెళ్లి దొంగతనానికి పాల్పడ్డ నిందితుడు
● 48 గంటల్లోనే అరెస్టు చేసి రిమాండ్‌కు
తరలించిన పోలీసులు
ఎల్లారెడ్డి: పలు చోరీ కేసుల్లో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ.. ఇటీవల బెయిల్‌పై వచ్చి మళ్లీ చోరీకి పాల్పడి, పోలీసులకు చిక్కాడు. ఎల్లారెడ్డిలో సోమవారం డీఎస్పీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. లింగంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన నీరుడి సాయిలు అనే పాత నేరస్థుడు పలు చోరీ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలులో అతడికి ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పుర్రె సాయిలు అనే నేరస్తుడితో పరిచయం ఏర్పడగా, వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఇటీవల అతడు బెయిల్‌పై విడుదల కాగా, ఈనెల 11న పుర్రె సాయిలు ఇంటికి వెళ్లి, మీ కొడుకు బెయిల్ కోసం డబ్బులు తీసుకురమ్మనాడని తల్లి కాశవ్వకు తెలిపాడు. బీరువాలో డబ్బులు దాచాడని, వాటిని ఇవ్వమని కోరాడు. ఆమె డ బ్బులు లేవని తెలపడంతో నిందితుడు వారితో ముచ్చటిస్తూ కల్లు తెప్పించాడు. వారంతా కల్లు తాగి, మత్తులో ఉండగా త లారి దుర్గవ్వపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్ల గొలుసును లాక్కున్నాడు. కుక్కల పోశవ్వ అనే మహిళ చేతికి ఉన్న వెండి కడియం తీసుకుని పారిపోయాడు. బాధితులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు. నీరుడి సాయిలును నిందితుడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి దాదాపు 12 గ్రాముల బంగారు గుండ్ల తాడు, 4 తులాల వెండి కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ రాజిరెడ్డి, ఎస్సై రాజు, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


