● నవీపేటలో తీవ్రమవుతున్న
ట్రాఫిక్ సమస్య
● ఆర్‌వోబీ లేక తీవ్ర ఇబ్బందులు
నవీపేట: రోజులో 52 వివిధ రైళ్లు నవీపేట మీదు గా రాకపోకలు సాగిస్తుండగా.. నిజామాబాద్ – బాసర రహదారిపై స్థానికంగా ఉన్న రైల్వే గేటు వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గేటు పడిన ప్రతిసారి సుమారు 15 నుంచి 20 నిమిషాలు వాహనాలు గేటుకు ఇరువైపులా నిలచిపోతున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేడ్చల్ నుంచి ముద్‌ఖేడ్ వరకు వేల కోట్లతో డబుల్ ట్రాక్ పనులకు నిధులు మంజూరవగా.. మొదటి విడతలో భాగంగా నవీపేట నుంచి బాసర వరకు ఇటీవల పనులను పూర్తి చేశారు. దీంతో రైళ్ల రాకపోకలు మరింత పెరిగాయి. నవీపేటలో ఆర్‌వోబీ నిర్మాణం చేపట్టాలని గత కొన్నేళ్లుగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు రైల్వే ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఎంపీలను కలిసి సమస్యను వివరించారు.
కిలో మీటర్ మేర ట్రాఫిక్
గేటు పడిన ప్రతిసారి ఇరువైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. గేటు తీయగానే ఒక్కసారిగా హార్న్ కొడుతూ పోటాపోటీగా గేటు దాటేందుకు పోటీపడుతున్నారు. ఈ గేటు మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందుగా గే టుపడిందా.. లేదా.. అని దూరం నుంచి చూడడం అలవాటు చేసుకున్నారు. మండల కేంద్రంలో ప్రతి శనివారం మేకలసంత సాగుతుండగా, ఆ రోజున ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది.
పూర్తికాని ఆర్‌యూబీ పనులు
నవీపేట ప్రధాన రైల్వేగేట్‌కు ఇరువైపులా కొంత దూరంలో వేర్వేరుగా ఆర్‌యూబీ(రైల్వే అండర్ బ్రిడ్జి) పనులు కొనసాగుతున్నాయి. సుమారు రూ.5 కోట్లతో మహంతం, ధర్మారం, దర్యాపూర్ ప్రాంతాల్లో పనులను ఏడాది కిందట ప్రారంభించారు. ఫలితంగా ఈ మూడు ప్రాంతాల రైల్వేగేట్లను మూసివేయడంతో ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు నవీపేట ప్రధాన రైల్వే గేటు మీదుగా వెళ్తున్నారు. ఆర్‌యూబీల పనులు ఆలస్యమవుతుండడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. పనులు పూర్తయ్యేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఎంపీ దృష్టికి ఆర్‌వోబీ సమస్య..
మండల కేంద్రంలో ఆర్‌వోబీ నిర్మాణాం చేపట్టాలని ఎంపీ ధర్మపురి అరవింద్‌కు విన్నవించాం. ట్రాఫిక్ సమస్యతో పాటు ఆర్‌వోబీ ఆవశ్యతను వివరించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి సమస్యకు పరిష్కారం చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్‌వోబీ నిర్మిస్తే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. – పిల్లి శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా నాయకులు, నవీపేట
ఇబ్బందులు పడుతున్నాం..
నవీపేటను ఆనుకుని ప్రధాన గేటు ఉండడంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. సుమారు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి గేటు పడుతుండడంతో విద్యార్థులు, ప్రయాణికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. నవీపేటలో ఆర్‌వోబీ నిర్మాణం ఆవశ్యకతను గుర్తించి, పనులను వెంటనే చేపడితే బాగుంటుంది. – గోదాంవార్ నవీన్‌రాజ్, ఉప సర్పంచ్, నవీపేట


