● వెలుగులోకి వచ్చిన చిరుతను
వేటాడిన ఘటన
● పోలీసుల అదుపులోకి నిందితులు
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): కమ్మర్‌పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సంచరించి కనిపించకుండా పోయి న పెద్దపులి జాడ కోసం మార్చి నెల నుంచి ఫారెస్ట్ అధికారులు వెతుకుతూనే ఉన్నారు. భీ మ్‌గల్ మండలం తాళ్లపల్లి అటవీప్రాంతంలో గత కొద్ది రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్న అటవీ అధికారులకు ఇటీవల మనుషు లు వాడిన గ్లౌవ్స్(చేతి తొడుగు) కనిపించడంతో అవాక్కయారు. అనుమానంతో పోలీ స్ శా ఖను సంప్రదించగా ఇక్కడే కథ మలుపు తిరిగింది. రంగప్రవేశం చేసిన సీసీఎస్ పోలీసులు ధర్పల్లి మండలానికి చెందిన ఒకరితోపాటు మరొకరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కారేపల్లి బీట్ పరిధిలో చిరుతను చంపి పూడ్చిపెట్టిన ఘటన వెలుగు చూసింది. పోలీసులు, అటవీశాఖ అధికారులు కారేపల్లి బీట్ పరిధికి చేరుకుని చిరుత కళేబరాన్ని పాతిపెట్టిన చోట జేసీబీతో తవ్వించి చిరుత అవశేషాలను వెలికితీశారు. స్వాధీనం చేసుకున్న చిరుత అవశేషాలను కమ్మర్‌పల్లి రేంజ్ కార్యాలయానికి తరలించి అక్కడే పోస్ట్‌మార్టం పూర్తి చేసి ల్యాబ్‌కు తరలించారు.
మరింత మంది గొర్రెల కాపరుల పాత్ర..?
తన మందలోని గొర్రైపె దాడి చేసి చంపిన చిరుతను చంపేందుకు కాపరి గొర్రె కళేబరానికి విషంతో కూడిన ఇంజక్షన్ ఇవ్వగా.. మళ్లీ వచ్చిన చిరుత గొర్రె మాంసాన్ని తిని మృత్యువాతపడినట్లు తెలుస్తోంది. అయితే చిరుత చర్మం, గోళ్లు తీసుకున్న గొర్ల కాపరుల మధ్య విక్రయించే విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో అసలు విషయం బయటికి పొక్కి నట్లు సమాచారం. చిరుతను చంపిన ఘటనలో మరికొంత మంది గొర్లకాపరుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్దపులి సంగతేమిటో..?
కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలో సంచరించి జాడలేకుండా పోయిన పెద్దపులి ఎక్కడ ఉందో తేలాల్సి ఉంది. చిరుతను హతమార్చిన అటవీప్రాంతంలోనే పెద్ద పులి సంచరించింది. చిరుతను హతమార్చిన నిందితులను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పెద్దపులికి సైతం హాని తలపెట్టి ఉంటారా అనే కోణంలో విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అటు పోలీసులు, ఇటు ఫారెస్ట్ అధికారులు ఈ ఘటనపై నోరు మెదపడం లేదు.


