భిక్కనూరు: లండన్‌లో జూన్ 22న మృతి చెందిన రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్‌రెడ్డి మృతదేహం శనివారం స్వగ్రామానికి చేరుకుంది. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన శ్రీనాథ్‌రెడ్డి తాను అద్దెకు ఉండే గదిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉదయం హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని అంబులెన్స్‌లో తలమడ్లకు తరలించారు. జాతీయ రహదారి జంగంపల్లి గ్రామశివారు నుంచి తలమడ్ల గ్రామంలోని శ్రీనాథ్‌రెడ్డి ఇంటివరకు ఆయన స్నేహితులు అంబులెన్స్ ముందట బైక్ ర్యాలీ నిర్వహించారు. దారిపొడవునా అంబులెన్స్‌పై పూలు చల్లారు. శ్రీనాథ్‌రెడ్డి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు మంజుల మధుసూదన్‌రెడ్డి బోరున రోదించడం కంటతడి పెట్టించింది. ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగం సాధిస్తాడని తాము కన్న కలలు అడియాశలు అయ్యాయని విలపించారు. సాయంత్రం గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు.
పిట్లం (జుక్కల్): గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటన మండలంలోని రూంతండా మూలమలుపు వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం నుంచి బాన్సువాడ వైపు సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న టాటాఏస్ వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై నిండు సిలిండర్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో అటువైపు వాహన రాకపోకలు లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. వాహనంలో ఉన్నవారికీ ఎలాంటి గాయాలు కాలేదు.


