● గుండెపోటుతో మహారాష్ట్ర వాసి మృతి
దైవదర్శనానికి వచ్చి..
మద్నూర్(జుక్కల్): దైవదర్శనానికి వచ్చిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని సలాబత్‌పూర్‌లో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై మోహన్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని బిలోలి తాలూక తడిహిప్పర్గాకు చెందిన మహజన్ రామలక్ష్మణ్(80) ఉదయం ఇంటి నుంచి సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయానికి బయల్దేరారు. హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్న రామలక్ష్మణ్ సమీపంలో ఉన్న శివాలయానికి వెళ్తుండగా గుండెపోటుతో రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుడి జేబులో లభించిన ఆధార్ వివరాలతో కుటుంబీకులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.
మాక్లూర్ : మండలంలోని అడవి మామిడిపల్లి శివారులో ఆటో బోల్తా పడిన ఘటనలో గాయపడిన చిన్నుబాయి శనివారం మృతి చెందినట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఆదర్శనగర్‌కు చెందిన చిన్నుబాయి తన కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం నందిపేట్ మండలంలోని ఓ దేవాలయానికి ఆటోలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో అడవి మామిడిపల్లి శివారులో కుక్క అడ్డం రావడంతో ఆటో బోల్తా కొట్టింది. దీంతో మిగతా కుటుంబసభ్యులకు స్వల్పగాయాలు కాగా చిన్నుబాయికి బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారని ఎస్సై తెలిపారు. చిన్నుబాయి సోదరుడు దేవిదాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


