14ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాలు ఇప్పించాలి | - | Sakshi
Sakshi News home page

14ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాలు ఇప్పించాలి

Mar 8 2026 7:37 AM | Updated on Mar 8 2026 7:37 AM

డీఎంహెచ్‌వో రాజశ్రీ

సుభాష్‌నగర్‌: గర్భాశయ క్యాన్సర్‌ (సర్వైకర్‌ క్యాన్సర్‌ నివారణ) రాకుండా 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాలు ఇప్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రాజశ్రీ సూచించారు. ఈ నెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో హెచ్‌పీవీ టీకాల పంపిణీని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభిస్తామని తెలిపారు. ఈసందర్భంగా జిల్లాలోని వైద్యాధికారులు, పీహెచ్‌సీ, వైద్యసిబ్బందితో జూమ్‌ మీటింగ్‌ ద్వారా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. మహిళల్లో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఈ హెచ్‌పీవీ అని తెలిపారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 28న ప్రారంభించారని, రాష్ట్రంలో కూడా అదేరోజు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభమైందని తెలిపారు. హెచ్‌పీవీ టీకాలు వేయడం, క్రమం తప్పకుండా స్క్రీనింగ్‌ చేయించడం ద్వారా సర్వైకల్‌ క్యాన్సర్‌ కొత్త కేసులు, మరణాలను తగ్గించవచ్చన్నారు. జిల్లాలో 14 ఏళ్ల బాలికలు మొత్తం 12,363 మంది ఉన్నారని, వీరందరికి ఆదివారం ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు ఇస్తామన్నారు. తర్వాత అన్ని పీహెచ్‌సీల్లో ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి అశోక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు రవీందర్‌, సమత, అశ్విని, ప్రోగ్రాం అధికారులు శ్వేత, వెంకన్న, వెంకటేశ్‌, శ్రావ్య, డీపీవో విశాల, డీహెచ్‌ఈ ఘన్‌పూర్‌ వెంకటేశ్వర్లు, ఫార్మసీ అధికారి నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement