ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను తోడేసి..
● అక్రమంగా లారీలలో
దూరప్రాంతాలకు తరలింపు
● భీమ్‌గల్ మండలంలో ఆగని దందా
● పట్టించుకోని అధికారులు
మోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను తోడేసీ, అక్రమంగా దూరప్రాంతాలను తరలిస్తున్నారు కొందరు అక్రమార్కులు. భీమ్‌గల్ మండలంలో ఇసుక అక్రమ దందా మూడు పువ్వులు, ఆ రు కాయలు అన్న చందంగా యథేచ్ఛగా సాగుతుంది. అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల కోసమంటూ తరలిస్తూ తమకు అనువైన స్థలంలో నిలువ చేసుకుంటున్నారు. రాత్రిపూ ట పెద్దపెద్ద లారీలలో దూర ప్రాంతాలకు తరలి స్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులే ఇసుక దందా సాగిస్తుండటంతో అధికార యంత్రాంగం మౌనం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మండలంలోని బెజ్జోరా కప్పల వాగు నుంచి రోజు సాగుతున్న ఇసుక రవాణా విషయంలో కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల అభ్యంతరాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకూ నాయకులే రంగంలోకి దిగి సోమవారం రాత్రిపూట అక్రమంగా సాగుతున్న రవాణాను అడ్డుకున్నారు. ఇసుకను తరలిస్తున్న వాహనాలను అధికారులకు పట్టించారు. ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల కోసం తరలించాలనే అధికారులు పగటి పూట అనుమతులు ఇస్తున్నారు. పగలు కొన్ని ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను తరలించి ఎక్కువ మొత్తంలో నిల్వ చేస్తూ తమ దందాను సాగిస్తున్నారని అధికార పార్టీ నాయకులపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారులు స్పందించి అసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


