ఇందిరమ్మ ఇళ్లకు ధరల భారం
● పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక,
ఇటుక, కంకర ధరలు
● లబ్ధిదారులపై అదనంగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల భారం
నందిపేట్(ఆర్మూర్):పెరిగిన సిమెంట్, ఇసుక, ఇటుక, కంకర, స్టీల్ ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణ లబ్ధిదారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణా లు గాడిన పడుతున్న తరుణంలోనే సామగ్రి రేట్లు అధికం కావడం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కూలీలు, మేసీ్త్రలు సైతం రేట్లు పెంచారు. పెరిగిన ధరలతో ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అదనపు భారం ప డుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. జిల్లాలో 19,306 ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఉండగా లబ్ధిదారులకు రూ. 5 లక్షలు దశల వారిగా ఆర్థిక సాయం విడుదలవుతుంది.
మండుతున్న ధరలు
ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 525 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. పథకం ప్రారంభ దశలో బస్తా ధర రూ. 280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి బస్తా రూ.50 నుండి 80 వరకు అదనంతో విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ. 1,47,000కు సిమెంట్ వచ్చేది. ప్రస్తుత రేటుతో సుమారు రూ.1.80 లక్షలు అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారునికి సిమెంట్ రూపేణా అదనంగా రూ. 33 వేలు భారం పడుతుంది. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. కానీ ఇసుక రవాణాదారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుక రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. వెయ్యి ఇటుకలకు ధర గతంలో రూ. 6 వేలు ఉండగా ప్రస్తుతం రూ. 9,500గా అమ్ముతున్నారు. అలాగే స్టీల్ ధర సైతం అమాంతం పెరిగింది. బేస్‌మెంట్ నిర్మాణంతోపాటు పిల్లర్లు స్లాబ్‌కు అవసరమయ్యే 20 ఎంఎం కంకర ధర ట్రాక్టరుకు రూ. 4500 ఉండగా ప్రస్తుతం రూ. 5100 పలుకుతోంది.
కూలీలకు ఫుల్ డిమాండ్
గతంలో కూలీల్లో పురుషులకు రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతం రూ. 1300 నుంచి రూ.1500 అడుగుతున్నారు. మహిళలకు రూ. 500 ఉండగా రూ. వెయ్యి డిమాండ్ చేస్తున్నారు. కూలీలు అడిగినంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా కూలీలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది.
నందిపేటలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లు


