జింకలు కుక్కల పాలు | - | Sakshi
Sakshi News home page

జింకలు కుక్కల పాలు

May 17 2025 12:18 AM | Updated on May 17 2025 12:18 AM

జింకల

జింకలు కుక్కల పాలు

గోదావరి తీరంలో వేటాడి

చంపుతున్న వీధి కుక్కలు

మిన్నకుండిపోతున్న

సంబంధిత అధికారులు

పూర్తిగా తగ్గిపోయిన జింకల సంఖ్య

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): శ్రీరాంసాగర్‌ (ఎస్సారెస్పీ) బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్‌గా మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం అక్కడ సంచరించే వన్య ప్రాణుల రక్షణను గాలికొదిలేసింది. స్వేచ్ఛగా విహరించే జింకలు, పక్షుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. వీధి కుక్కలు వేటాడి పీక్కు తింటున్నాయి. కళ్లముందే వాటి ప్రాణాలు పోతుంటే శివారు గ్రామ పంచాయతీలు, సంబంధిత శాఖ ల అధికారులు మిన్నకుండిపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోతే ఎకో టూరిజం ఏర్పాటయ్యే నాటికి జింకలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది.

వందల నుంచి పదికి..

ఒకప్పుడు వందల్లో కనిపించే జింకలు వీధి కుక్కల కారణంగా ఇప్పుడు పదికి మించి కనిపించడం లేదు. వన్యప్రాణులను చూసేందుకు వెళ్లిన వారికి కుక్కల గుంపులే దర్శనమిస్తున్నాయి. ప్రతి ఏడాది వేసవిలో ఎస్సారెస్పీలో బ్యాక్‌ వాటర్‌ తగ్గిపోయి పచ్చిక బయళ్లు ఏర్పడుతాయి. చిన్నయానం, గాదేపల్లి, జీజీ నడ్కుడ, గంగాసముందర్‌, అన్నారం, సిర్పూర్‌, నికాల్‌పూర్‌ గ్రామాల శివార్లలో కిలోమీటర్ల మేర గడ్డితో పచ్చదనం కనిపిస్తుంది. పచ్చికను మేసేందుకు జింకలు బ్యాక్‌వాటర్‌ ప్రాంతానికి వస్తాయి. ఐదారేళ్ల క్రితం ఎటు చూసినా జింకల మందలు కనిపించేవి. కుక్కల బెడద, సందర్శకుల తాకిడి మొదలైనప్పటి నుంచి జింకలకు ప్రాణ భయం మొదలైంది. గ్రామాల్లో ఉండే వీధి కుక్కలు జింకల రుచి మరగడంతో అవి బ్యాక్‌ వాటర్‌లోనే తిష్టవేశాయి. జింకల పరుగును అందుకోలేని శునకాలు తెలివిగా నలుదిక్కులా మాటు వేసి వేటాడుతున్నాయి. వాటి చేతికి చిక్కిన జింకలు విలవిల్లాడుతూ ప్రాణాలొదులున్నాయి. వర్షాకాలంలో, వరద నీరు వచ్చిన సమయంలో కూడా జింకలు ఒడ్డుకు, పొలాల్లోకి రావడంతో కుక్కలకు సులభంగా చిక్కుతున్నాయి. శివారు గ్రామాల ప్రజలు, మత్స్యకారులు గాయపడిన జింకలను ఊరిలోకి తీసుకొచ్చి అటవీ, పశువైద్యాధికారులతో చికిత్సలు చేయిస్తున్నారు. చనిపోయిన వాటికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కుక్కలను తరుముతున్నా మళ్లీ వస్తున్నాయని, గ్రామాల్లో దూడలను సైతం దాడి చేసి చంపేస్తున్నాయని స్థానిక ప్రజలు, రైతులు, మత్స్యకారులు వాపోతున్నారు. వాటిని పట్టుకొని ఇక్కడి నుంచి తరలించాలని అధికారులను కోరుతున్నారు. కాగా, బ్యాక్‌వాటర్‌ ప్రాంతంలో అటవీ శాఖ నుంచి బీట్‌ ఆఫీసర్‌ లేక పర్యవేక్షణ కష్టంగా మారింది. బీట్‌ ఆఫీసర్‌ను నియమిస్తామని ఉన్నతాధికారులు చాలాసార్లు మాట ఇచ్చినప్పటికీ ఎందుకో అది అమలు కావడం లేదు.

మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

వీధి కుక్కలు జింకలను వేటాడుతున్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఇది వరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గ్రామస్తులు, మత్స్యకారులు సాయంతో గాయపడిన జింకలకు చికిత్స అందిస్తున్నాం. కుక్కల సమస్యను పూర్తిగా నివారించడానికి ఉన్నతాధికారుల దృష్టికి మరోసారి తీసుకెళ్తాం. చర్యలు చేపట్టాలని కోరుతాం.

– సుధాకర్‌, డిప్యూటీ ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌

జింకలు కుక్కల పాలు 1
1/1

జింకలు కుక్కల పాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement