సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఐపీఎల్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ యాప్‌లు మరింత విజృంభిస్తున్నాయి. అదృష్టం కలిసి వస్తుందని, తేలికగా డబ్బు సంపాదించుకోవచ్చనే అత్యాశతో పలువురు బెట్టింగ్ రాయుళ్లు బయల్దేరారు. బెట్టింగ్ వైపు యువతను, క్రికెట్ అభిమానులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐపీఎల్‌కు సంబంధించి ప్రతి బంతికి బెట్టింగ్ చేసేలా యాప్‌లు పకడ్బందీగా కథ నడిపిస్తున్నాయి. డాట్ బాల్ మొదలు, సింగిల్ రన్, ఫోర్, సిక్సర్, వికెట్ అంటూ బంతిబంతికీ ప్రత్యేకంగా కథ నడిపిస్తున్నారు. బెట్టింగ్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న యాప్‌లను, లింకుల ద్వారా పంపి టెంప్ట్ చేస్తున్నారు. బెట్టింగ్ కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌లతోపాటు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా గ్రూపుల ద్వారా జిల్లాలో బెట్టింగ్ నడిపిస్తున్నారు. రెగ్యులర్‌గా రమ్మీ, స్కిల్ గేమ్స్ వంటివి ఆడిన వారు తాజాగా ఐపీఎల్ బెట్టింగ్‌లోకి దిగుతున్నారు. అంతా చేతిలోని స్మార్ట్ ఫోన్‌తోనే కావడంతో జిల్లాకు చెందిన అనేకమంది వయస్సుతో సంబంధం లేకుండా బెట్టింగ్ ఊబిలోకి దిగుతున్నారు. క్రమంగా ఇది వ్యసనంగా మారుతోంది. బెట్టింగ్‌ల కోసం అప్పులు చేస్తుండడంతో అనేక కుటుంబాలు రోడ్డుపైకి వస్తున్నాయి. మానసికంగా కుంగిపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పులు ఇచ్చిన వారిని తీసుకున్నవారు విషపు ఇంజక్షన్లు ఇచ్చి హతమార్చిన ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాల్లో వెలుగు చూశాయి. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలంగాణలో బెట్టింగ్ నిషేధిత చట్టం చేసినప్పటికీ..
తెలంగాణ ప్రభుత్వం 2015లోనే బెట్టింగ్ నిషేధిత చట్టాన్ని చేసింది. అయినప్పటికీ హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్ల హవా విచ్చలవిడిగా నడుస్తోంది. ఇక పక్కనే ఉన్న ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో బెట్టింగ్ యాప్‌ల నిషేధ చట్టం చేశారు. అయితే తాజాగా వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ బెట్టింగ్ యాప్‌లకు స్వాగతం పలికేలా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేసిన నిషేధాన్ని ఎత్తేసి మరీ అనుమతులు ఇవ్వడం గమనార్హం. తెలంగాణలో మాత్రం బెట్టింగ్ యాప్‌లపై నిషేధం ఉంది.
సెలబ్రిటీల ప్రమోషన్ కూడా కారణమే..
అనేక రకాల బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లను ప్రమోట్ చేసినవారిలో స్టార్ క్రికెటర్లు, బాలీవుడ్ యాక్టర్లు, తెలుగు నటీనటులు ఉన్నారు. దీంతో సహజంగానే బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులయ్యేవారి సంఖ్య పెరిగింది. ధోని, సచిన్ టెండూల్కర్, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి వంటి క్రికెటర్లు, నటులు షారుఖ్‌ఖాన్, సోనూసు ద్, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, రాణా, మంచు లక్ష్మి తదితరులు, బాలకృష్ణ నిర్వహించే అన్‌స్టాపబుల్ షో ద్వారా బెట్టింగ్ యాప్‌ల గురించి భారీగా ప్రమోట్ చేయడంతో పలువురు ఆకర్షితులయ్యారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. జిల్లాలోనూ బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక దృష్టి సారించామని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.
బెట్టింగ్ మాఫియాపై ప్రత్యేక దృష్టి
వడ్డేపల్లి కుటుంబ బలవన్మరణం
కేసు పునః పరిశీలన
సీపీ పోతరాజు సాయిచైతన్య
మొదట్లో డబ్బులు
వచ్చేలా చేస్తారు
యాప్‌లు, వెబ్‌సైట్లలో బెట్టింగ్ చేసే వారిని మొదట డబ్బులు గెలుచుకునేలా చేస్తారు. తరువాత లక్షల్లో డబ్బులు గుంజుతారు. వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే బెట్టింగ్ లింక్‌లకు టెంప్ట్ కాకుండా ఉంటే మంచిది. తెలంగాణ ప్రభుత్వం 108 అక్రమ బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లను తాజాగా బ్లాక్ చేసింది. మరో 133 బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులిచ్చింది. ప్రతిఒక్కరూ ఈ బెట్టింగ్ యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండి, వాటిబారిన పడకుండా ఉండాలి. – రాజావెంకటరెడ్డి, ఏసీపీ, నిజామాబాద్
ఖలీల్‌వాడి: బెట్టింగ్ యా ప్‌లను ప్రమోట్ చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ పోతరాజు సాయిచైతన్య హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ పర్యవసనంతో ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణం చెందిన కేసును పునఃపరిశీలిస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈజీ మనీ వస్తుందనే ఆశతో 23 ఏళ్ల యువకుడు బెట్టింగ్ యాప్‌లకు బానిసగా మారడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. బెట్టింగ్‌లో నష్టపోతూ కుటుంబంపై అప్పుల భారం పెరగడంతో మానసిక బాధతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును మొదట ఆర్థిక ఇబ్బందుల ఒత్తిడిగా నమోదు చేశామని, కానీ, ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, సామాజిక ప్రమాదమని చెప్పారు. వడ్డేపల్లి ఘటనను సీరియస్‌గా తీసుకున్నామని, అసలు కారణాలపై దర్యాప్తు జరిపి, బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ యాప్‌లకు యువకులు, ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ మాఫియాపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు.
బంతి బంతికీ బెట్టింగ్
బంతి బంతికీ బెట్టింగ్
బంతి బంతికీ బెట్టింగ్
బంతి బంతికీ బెట్టింగ్