ఉపాధి నిధులతో కొత్త పనులు
మోర్తాడ్(బాల్కొండ): వికసిత్ భారత్ గ్యారెంటీ ఫ ర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) వీ జీ–జీ–రామ్‌జీ (ఉపాధిహామీ) నిధులతో సరికొత్త పనులు చేపట్టేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామాల నుంచి ప్రతిపాదనలను కో రుతోంది. ఉపాధి నిధులతో మెటీరియల్ కంపోనెంట్ కింద గతంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టుల నిర్మాణం మాత్రమే చేసేవారు. అయితే పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ కొత్త రకం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జీ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు సొంత భవనాల నిర్మాణం, ఆహార ధాన్యాల నిల్వ చేసుకునేందుకు వంద మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణం, వివిధ రకాలైన పనులు చేసేవారికి వర్క్‌షెడ్స్‌ను నిర్మించాలని నిర్ణయించారు. మహిళా భవనాలు, వర్క్‌షెడ్‌ల కోసం రూ.10లక్షల చొప్పున, ఆహార ధాన్యాల నిలువ కోసం చేపట్టే పనులకు రూ.30లక్షలను కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మహిళా భవనాలకు ఇది వరకు ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రమే తమ కోటా నిధుల నుంచి కేటాయించేవారు. అనేక చోట్ల అనువైన భవనాలు లేకపోవడంతో మహిళలు తమ సమావేశాల కోసం ఇబ్బందు లు పడుతున్నారు. ఆహార ధాన్యాల నిలువ కోసం ప్రతి గ్రామంలో గోదాములను నిర్మిస్తే రైతులు తాము ఆశించిన ధర వచ్చినప్పుడే పంట దిగుబడులు విక్రయించుకోవడం, లేదా అవసరం ఉన్నన్ని రోజులు నిలువ చేసుకోవడానికి వీలవుతుంది. వృత్తి పనులు, ఇతర పనులు చేసేవారికి షెడ్‌లు లేకపోవడంతో అద్దె గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉపాధి నిధులతో కొత్త తరహా పనులు చేపడితే ప్రజాప్రయోజనం విస్తృతం అవుతుందని ప్రభు త్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను మెటీరియల్ కంపోనెంట్ కింద కొత్త పనుల కోసం ప్రతిపాదనలను స్వీక రించనున్నారు. గ్రామ స్థాయిలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు చేసి గ్రామసభలో ఆమోదం పొందాలి. అక్కడి నుంచి మండల స్థాయిలో, ఆ తరువాత జిల్లా స్థాయిలో సాంకేతిక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామ కంఠం పరిధిలో ఉన్న భూముల్లోనే నిర్మాణాలను చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. అనువైన స్థలాలు ఉన్నచోట మూడు రకాల పనులను పూర్తి చేయడానికి అవకాశం ఉంది. పాత విధానాలకు స్వస్తి పలికి కొత్త పనులు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగిన పరిణామమని చెప్పొచ్చు.
మహిళా సంఘాలకు భవనాలు..
ఆహార ధాన్యాల నిల్వకు
అవసరమైన నిర్మాణాలు, వర్క్‌షెడ్డులు
సీసీ రోడ్లు, కల్వర్టుల స్థానంలో..
ప్రతిపాదనలు తీసుకోవాలని ఆదేశాలు
పాత పద్ధతికి స్వస్తి
పలుకుతున్న యంత్రాంగం


