కమ్మర్‌పల్లి: రోడ్డు ప్రమాదమైనా.. పాము కాటేసినా.. గుండెపోటుకు గురైనా... గర్భిణులు పురిటి నొప్పులు పడుతున్నా అత్యవసరంగా 108 అంబులెన్స్ సేవలను వినియోగిస్తున్నాం. ఈ సేవల్లో కీలకంగా పనిచేసేది ఈఎంటీలు(అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులు). వీరు విధి నిర్వహణలో 24 గంటలపాటు వైద్య సేవలందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. గురువారం జాతీయ ఈఎంటీల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో అత్యవససర సేవల్లో నిమగ్నమై స్ఫూర్తిదాయకమైన వైద్య సేవలందిస్తున్న ఈఎంటీలపై ప్రత్యేక కథనం.. ఉమ్మడి జిల్లాలో గత 20 ఏళ్లుగా 108 అంబులెన్సుల్లో సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారు. అంబులెన్స్ వాహనం పైలట్‌తో పాటు ఈఎంటీ విధులు నిర్వహిస్తారు. అత్యవసర వైద్య సాంకేతిక నిపుణులుగా సుశిక్షితులైన ఈఎంటీలు అత్యవసర సమయంలో రోగులను తరలిస్తూ ప్రాథమిక చికిత్సలను వాహనంలోనే అందిస్తూ ఆస్పత్రులకు చేర్చేలోపు పిలిచే మొదటి గంట (గోల్డెన్ అవర్)లో వీరి సేవలు కీలకంగా మారుతున్నాయి. అత్యవసర ప్రాథమిక చికిత్సతోపాటు, ఆపై ఆస్పత్రులకు సకాలంలో చేరుస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ పురస్కారాలు అందజేస్తోంది.
ఉమ్మడి జిల్లాలో వివరాలు
ఏడాదిలో
నమోదైన కేసులు: 63,431
అంబులెన్సులు: 49
నియోనాటల్ అంబులెన్సులు: 02
ఈఎంటీ ఉద్యోగులు: 102
గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు నిలుపుతున్న 108 సిబ్బంది
నేడు జాతీయ వైద్య సాంకేతిక
నిపుణుల దినోత్సవం


