ఖలీల్‌వాడి: జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని అనుమతి లేకుండానే అడ్మిషన్ల దందాకు తెరలేపాయి. రంగు రంగుల బ్రోచర్లు, ప్రధాన కూడళ్ల వద్ద హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. సీబీఎస్‌ఈ పేరిట అందినకాడికి దోచుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలల వ్యవహారాన్ని అడ్డుకోవడంలో జిల్లా విద్యాశాఖ విఫలమవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు చేయకుండా కార్యాలయాలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రూ.లక్షల్లో ఫీజులు..
తల్లిదండ్రులు తాము పడ్డ కష్టాలు పిల్లలు పడకూడదని ఆలోచిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని అందినకాడికి దోచుకునేందుకు కార్పొరేట్ స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. స్కూల్ స్థాయి నుంచే ఐఐటీ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామని చెబుతున్న యాజమాన్యాలు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. వేలల్లో ఒకరిద్దరికి వచ్చే ర్యాంకులను చూపి మాయమాటలతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. నిజమే అని నమ్మిన చాలా మంది తల్లిదండ్రులు స్థిరాస్తులను అమ్ముకొని, అప్పులు చేసి మరీ విద్యార్థులను కార్పొరేట్ స్కూళ్లలో చేరుస్తున్నారు.
కలెక్టర్ దృష్టి సారిస్తేనే..
నిజామాబాద్ నగరంతోపాటు జిల్లాలో కార్పొరేట్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నగరంలో ఐదు స్కూళ్లకే సీబీఎస్‌ఈ అనుమతులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం స్కూళ్ల అనుమతులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, డీఈవో నుంచి అనుమతి పొందిన తర్వాత సీబీఎస్‌ఈ అనుమతి తీసుకోవా ల్సి ఉంటుంది. కానీ అలాంటివేమీ పట్టించుకోకుండా నేరుగా సీబీఎస్‌ఈ, డీజీ, ఇంటర్నేషనల్ పేరిట స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత జరుగుతు న్నా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ దృష్టి సారించి అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
నజరానా.. టార్గెట్లు..
కార్పొరేట్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్ రూరల్‌లో నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సీబీఎస్‌ఈకి ప్రభుత్వ అనుమతి లే దు. మోసపూరిత ప్రకటనలతో విద్యార్థుల నుంచి లక్షలాది రూ పాయలు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల విషయంలో జిల్లా విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని అనుమతి లేని స్కూల్‌పై చర్యలు తీసుకోవాలి.
– జన్నారపు రాజేశ్వర్,
జిల్లా ప్రధాన కార్యదర్శి, పీడీఎస్‌యూ
ఎంఈవోతో నోటీసులిస్తాం..
నగరంతోపాటు జిల్లాలోని ప్రయివేట్, కార్పొరేట్ స్కూళ్లకు ఎంఈవో ద్వారా నోటీసులు అందిస్తున్నాం. కేశాపూర్‌లోని నారాయణ స్కూల్‌కు నోటీసులు ఇవ్వాలని ఎంఈవోను ఆదేశించా. అనుమతులు తీసుకున్న తర్వాత, స్కూల్స్ ప్రారంభంలోనే అడ్మిషన్లు తీసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
– పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్
అనుమతులు లేకుండానే
అడ్మిషన్ల దందా
విద్యార్థుల ఇళ్లకు పీఆర్వోలు, టీచర్లు
ఆఫర్ల పేరిట తల్లిదండ్రులకు ఎర
ఆకర్షించేలా ఫ్లెక్సీలు,
హోర్డింగుల ఏర్పాటు
చోద్యం చూస్తున్న విద్యాశాఖ
అనుమతిలేని స్కూళ్ల బోర్డులు పెట్టాలి..
అనుమతులు లేని పాఠశాలల వద్ద విద్యాశాఖ అధికారులు ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మోసపోకుండా ఉంటారు. అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేట్ స్కూళ్ల బోర్డులను వెంటనే తొలిగించేలా అఽధికారులు చర్యలు తీసుకోవాలి.
– భట్టు వేణురాజ్, ఎన్‌ఎస్‌యూఐ,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అధికారుల నిర్లక్ష్యమే..
అనుమతిలేని కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. సీబీఎస్‌ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరిట తల్లిదండ్రులను మోసం చేసి, అధిక ఫీజులు గుంజుతున్నాయి. విద్యాశాఖ అధికారులు వాటిని అదుపు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు.
– రాచకొండ విఘ్నేష్, ఎస్‌ఎఫ్‌ఐ,
జిల్లా ప్రధానకార్యదర్శి, నిజామాబాద్
విద్యా సంవత్సరం ముగియక మునుపే కార్పొరేట్ యాజమాన్యాలు అడ్మిషన్లు చేపడుతున్నాయి. పీఆర్వోలు, టీచర్లను నగరంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల ఇళ్లకు పంపుతున్నారు. తల్లిదండ్రులకు మాయమాటలు చెప్తూ డిస్కౌంట్‌ల పేరిట అడ్మిషన్లు చేస్తున్నారు. ఒక్క విద్యార్థిని స్కూల్‌లో చేర్పిస్తే పీఆర్వోకు రూ. వెయ్యి నుంచి రూ. 5 వేల చొప్పున నజరానాగా చెల్లిస్తున్నాయి. మరోవైపు సంబంధిత స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లు, బోధనేతర సిబ్బంది తప్పకుండా 20 వరకు అడ్మిషన్లు తీసుకురావాలని యాజమాన్యాలు టార్గెట్లు విధించినట్లు సమాచారం. దీంతో టీచర్లు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల ఇళ్ల బాట పడుతున్నారు.


