రెంజల్(బోధన్): వచ్చే సంవత్సరం నిర్వహించే గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు అధికారులు ప్రణాళికతో పనులు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గతంలో జరిగిన పుష్కరాల్లో చోటు చేసుకున్న తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రాన్ని మంగళవారం సంబంధిత శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. అంతకుముందు పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ డివిజన్ స్థాయి అధికారులతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు అవసరమైన అన్ని రకాల పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వారం రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డితో కలిసి క్షేత్రాన్ని సందర్శించిన సమయంలో అధికారులకు వివరించిన పనులు ఏ మేరకు పూర్తయ్యాయనే విషయాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించి ఆయా శాఖల అధికారులు చేపట్టిన పనుల వివరాలను ఆరా తీశారు. త్రివేణి సంగమ పుష్కరక్షేత్రానికి పర్వదినాలతోపాటు ప్రతి శుక్ర, ఆదివారాలు భక్తులు వస్తారని, పుష్కరాల సమయంలో లక్షల్లో వచ్చే అవకాశం ఉంటుందన్నారు. పనులు దీర్ఘకాలం నిలిచేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఘాట్‌కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, వంతెనల నిర్మాణ పనులు, రోడ్ల విస్తరణ పనులపై పురోగతి సాధించాలన్నారు. వీఐపీలు వచ్చే అవకాశం ఉన్నందున హెలిప్యాడ్‌ను నిర్మించాలన్నారు. వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటి సౌకర్యాలు చేయాలన్నారు. ఘాట్ల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, స్థానిక సర్పంచ్ గయాసొద్దీన్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఎంపీడీవో కమలాకర్, పీఆర్ డీఈ వెంకటేశ్వర్‌రావ్ తదితరులు ఉన్నారు.
భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు
రహదారులను గుర్తించి పనులు
ప్రారంభించండి
అధికారులకు కలెక్టర్
ఇలా త్రిపాఠి ఆదేశం
కందకుర్తి త్రివేణి సంగమ
పుష్కరక్షేత్రం పరిశీలన


