2,559 ఎకరాల్లో పంట నష్టం
● జిల్లాలో 14 మండలాల్లో నష్టపోయిన 2,209 మంది రైతులు
● నిజామాబాద్ మార్కెట్‌లో
తడిసిపోయిన పసుపు కుప్పలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా 14 మండలాల్లో 2,209 మంది రైతులకు చెందిన 2,559 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో వరి పంటకు అత్యధికంగా నష్టం వాటిల్లింది. మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలు కొన్నచోట్ల దెబ్బతిన్నాయి. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డులో రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చిన పసుపు కుప్పలు తడిసిపోయాయి. ఉదయం నుంచి గంజ్‌లో 27,800 బస్తాల పసుపును రైతులు విక్రయించారు. పసుపు అధికంగా రావడంతో మరుసటి రోజు మంగళవారం తూకం వేయాల్సి ఉంది. కానీ అంతలోనే భారీ ఈదురుగాలులతో వర్షం కురిసింది. గాలులకు పసుపు కుప్పలపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. తూకం వేసే సమయంలో తడిసిన పసుపు పంట నుంచి తరుగు తీయొద్దని రైతులు కోరుతున్నారు. కాగా తడిసిన పసుపును ఎండబెట్టిన తర్వాత తూకం వేయాలని, తరుగు తీసి రైతులను నష్టపర్చవద్దని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి వ్యాపారులను ఆదేశించారు. తరుగు తీసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
● ఆర్మూర్ పట్టణం, మండలంలో పలు గ్రామాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న దెబ్బతింది. మామిడి కాయలు నేలరాలాయి. మండల వ్యవసాయాధికారి హరికృష్ణ పిప్రి, ఫత్తేపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్టం వివరాలను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. మాక్లూర్ మండలం చిక్కిలి, గుంజిలి, కొత్తపల్లి గ్రామాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయింది. మరికొన్ని చోట్ల కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. తడిసిన ధాన్యం ఆరబెట్టుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. నేలవాలిన వరిలో కంకులు రాలిపోతాయని రైతులు వాపోతున్నారు. సింగంపల్లి, వల్లభాపూర్, కొత్తపల్లి, చిన్నాపూర్ ప్రాంతాల్లో మామిడి కాయలు రాలిపోయాయి.
● కమ్మర్‌పల్లి మండలం ఉప్పులూరు గ్రామంలో నువ్వుల పంట నేలకొరిగింది. కల్లాల్లో పసుపు కొమ్ములు తడిసిపోయాయి. ఇక ఎడపల్లి, రెంజల్ మండలాల్లోని పలు చోట్ల, ఎడపల్లి మండలం జాకోరాలో స్వల్ప విస్తీర్ణంలో వరి పంట నేలకొరిగింది. కొన్ని చోట్ల నూర్పిడి చేసిన ధాన్యం తడవకుండా చేసుకునేందుకు రైతులు అగచాట్లు పడ్డారు.
ఎడపల్లిలో నేలవాలిన వరి పైరు
మండలాల వారీగా పంట నష్టం వివరాలు


