కామారెడ్డి క్రైం: మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయించే ఓ ముఠాను దేవునిపల్లి పోలీసులు పట్టుకున్నారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వివరాలు వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇల్చిపూర్ శివారులోని వీఐపీ వెంచర్‌లో రూరల్, సీసీఐ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన 9 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద 1.60 కిలోల గంజాయి ప్యాకెట్లు లభించాయి. వాటి విలువ రూ.50 వేల వరకు ఉంటుందని ఏఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో గాంధారికి చెందిన మంజ్యా వెంకట్రామ్, అదే మండలంలోని చద్మల్ తండాకు చెందిన బామన్ అమర్ సింగ్, గుడిమెట్ గ్రామానికి చెందిన ఆర్ల మధుసూదన్ రావు ప్రధాన నిందితులని పేర్కొన్నారు. వారు మహారాష్ట్ర నుంచి గంజాయిని తెప్పించి చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలోకి మారుస్తూ కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాలు, పరిసర ప్రాంతాల్లో కొంతకాలంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. పట్టుబడిన వారిలో మిగిలిన ఆరుగురు ప్రధాన నిందితుల వద్ద గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ఎన్‌డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన దేవునిపల్లి, సీసీఎస్ పోలీసులను అభినందించారు.


