లెక్క చెప్పండి..
మోర్తాడ్(బాల్కొండ): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు పోటీచేసిన ప్రతి ఒక్కరూ తమ ఎన్నికల ఖర్చు లెక్కలను అప్పగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల తంతు ముగిసిన 45 రోజులలోగా అభ్యర్థులు తమ తమ ఖర్చుల వివరాలను లెడ్జర్‌లో రాసి ఆయా మండలాల పంచాయతీరాజ్ అధికారులకు అప్పగించాలని నిర్దేశించింది. జిల్లాలో మూడు విడతల్లో 545 సర్పంచ్, 5022 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఏకగీవ్రంగా ఎన్నికై న అభ్యర్థులతోపాటు ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన, ఓడిన వారందరూ ఎన్నికల సంఘం నియామావళి ప్రకారం ఖర్చుల లెక్కలను అప్పగించాల్సి ఉంది. మొత్తం 5567 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. 5 వేలకు మించి జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన వారు రూ.2.50లక్షల వరకు, వార్డు సభ్యులు రూ.50వేల వరకు ఖర్చు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. 5వేల కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.30వేల వరకు ఖర్చు చేయొచ్చు. నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి పోలింగ్ ముగిసే రోజు వరకు ఎన్నికల్లో పోటీ చేసిన వారు అన్ని రకాల ఖర్చులకు లెక్కలు రాసి ఎన్నికల సంఘానికి అప్పగించాల్సి ఉంది. పరిమితికి మించి ఖర్చు చేస్తే ఎన్నికల సంఘం వేటు వేస్తుంది.ఖర్చుల వివరాలు అందించని వారిపైనా వేటు పడనుంది. ఎన్నికల సంఘం ఆదేశాలు పాటించకపోతే అలాంటి అభ్యర్థుల వివరాలను సంఘానికి అందించాలనే ఆదేశాలు ఉన్నాయని మోర్తాడ్ ఎంపీవో శ్రీధర్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రతి అభ్యర్థి తమ తమ ఖర్చుల వివరాలను అందించి ఎన్నికల సంఘానికి సహకరించాలని ఆయన సూచించారు.
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు
గడువులోగా వివరాలు
అందించాలని ఆదేశాలు
ఎన్నికల్లో పోటీ చేసిన వారు
5567 మంది


