ఈసారి వేర్వేరుగా కొనుగోళ్లు
● జిల్లా వ్యాప్తంగా 622 కేంద్రాలు
● సన్నరకానికి 429,
దొడ్డురకానికి 193 సెంటర్లు
● 7 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యం సేకరణ లక్ష్యం
● రేపు సంబంధిత శాఖలతో సమన్వయ సమావేశం
సుభాష్‌నగర్ : జిల్లాలో వరి పంట చేతికొస్తుంది. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈసారి సన్న, దొడ్డు రకాలకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. జిల్లా వ్యాప్తంగా సన్నరకానికి 429, దొడ్డు రకం ధాన్యానికి 193 కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఏప్రిల్ 1 నుంచి కొనుగోళ్లు ప్రారంభించేలా సర్వం సన్నద్ధం చేస్తున్నారు.
4.20 లక్షల ఎకరాల్లో సాగు..
జిల్లా వ్యాప్తంగా రైతులు 4.20 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 3.75 లక్షల ఎకరాల్లో సన్నరకాలు, మిగతా 45 వేల ఎకరాల్లో ఇతర రకాలు పండించారు. మొత్తం 11.85 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి అంచనా వేయగా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 7 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం 622 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాను 10 సెక్టార్లుగా విభజించి ధాన్యం రవాణా చేపట్టనున్నారు. గత వానాకాలం సీజన్‌లో దక్కించుకున్న కాంట్రాక్టర్లనే ఈసారీ కొనసాగించనున్నారు. సేకరించిన ధాన్యాన్ని సుమారు 250 రైస్‌మిల్లులకు కేటాయించనున్నారు. ధాన్యం సేకరణకు దాదాపు కోటీ 70 లక్షల గన్నీబ్యాగులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 55 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా, మిగతా వాటిని తెప్పిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తయ్యాయి
జిల్లాలో ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే కొనుగోళ్లు ప్రారంభిస్తాం. సన్న, దొడ్డురకాలకు వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అన్నిశాఖల అధికారుల సమన్వయం, రైతుల సహకారంతో యాసంగి సీజన్‌లో కొనుగోళ్లను విజయవంతం చేస్తాం.
– కిరణ్‌కుమార్, అదనపు కలెక్టర్
సన్నరకాలకు బోనస్!
రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు గత సీజన్‌లో క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. వానాకాలంలో 47,811 మంది రైతులకు రూ.158.63 కోట్ల బోనస్‌ను వారి ఖాతాల్లో జమ చేసింది. యాసంగిలోనూ బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో 85 శాతం మేర రైతులు సన్నరకాన్ని సాగుచేశారు. సన్నరకం ధాన్యాన్ని గుర్తించేందుకు మార్కెటింగ్ శాఖ ద్వారా ఒక్కో సెంటర్‌కు ధాన్యం కొలిచే యంత్రాన్ని సరఫరా చేయనున్నారు. ఇదిలా ఉండగా సన్న, దొడ్డురకం కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేయనుండడంతో రైతుల్లో బోనస్ ఆశలు రేకెత్తుతున్నాయి.
రేపు కో ఆర్డినేషన్ సమావేశం
ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగేందుకు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ నేతృత్వంలో ఈ నెల 19న సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ, సహకార, పౌరసరఫరా, రెవెన్యూ, మెప్మా, డీఆర్డీవో, రవాణా, ఇతర అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులతోపాటు క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది సమావేశంలో పాల్గొననున్నారు.
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం