మాట్లాడుతున్న ట్రాఫిక్ ఏసీపీ నారాయణ
తెయూ(డిచ్‌పల్లి): వాహనదారులు తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ సూచించారు. 35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సోమవారం తెయూలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆరతి అధ్యక్షతన రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే 80 శాతం ప్రమాదాలు జరగకుండా ఉంటాయన్నారు. భారతదేశంలో సుమారు 140 కోట్ల జనాభా ఉండగా 40 కోట్ల వాహనదారులు ఉన్నారని తెలిపారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లో శిక్షణతో పాటు లైసెన్సు కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో నేషనల్ హైవే 44 రూట్ ఆఫీసర్ వీర్రాజు, ఇంటిగ్రేటెడ్ రోడ్ ఆక్సిడెంట్ డాటా బేస్ ఆఫీసర్ వర్ష నిహంత్, ట్రాఫిక్ రిజర్వు ఇన్‌స్పెక్టర్ సతీశ్, అధ్యాపకులు సంపత్ కుమార్, ఎ పున్నయ్య, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


