బాల్కొండ: ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ట్లు ముప్కాల్ ఎస్సై భాస్కరాచారి ఆదివారం తెలిపారు. పొలంలో మృతదేహం ఉందన్న సమాచారం అందడంతో ఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. నెల రోజుల క్రితం మృతి చెంది ఉంటాడని, ఎవరైనా హత్య చేసి ఈ ప్రాంతంలో పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మూడు రోజుల్లో రెండు మృతదేహాలు..
ఉమ్మడి బాల్కొండ మండల పరిధిలో మూడు రోజుల్లో రెండు గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమయ్యాయి. గత శుక్రవారం మెండోరా మండలం దూదిగాం శివారులోని గోదావరిలో 15 ఏళ్ల బాలిక మృతదేహం, ఆదివారం కొత్తపల్లిలో గుర్తు తెలియ ని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీంతో పోలీసుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల క్రితం ముప్కాల్ మండలం వేంపల్లి శివారులో గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హత్య చేసి తగులబెట్టారు. ఇప్పటికీ ఆ కేసు చేధించలేదు. మూడు రోజుల వ్యవధిలో రెండు గుర్తు తెలియని మృతదేహాలు ఉమ్మడి బాల్కొండలో లభ్యం కావడంతో పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.