పుస్తెలతాడు కోసం దంపతుల హత్య | - | Sakshi
Sakshi News home page

పుస్తెలతాడు కోసం దంపతుల హత్య

Jul 30 2023 12:48 AM | Updated on Jul 30 2023 9:01 AM

- - Sakshi

నిజామాబాద్‌: జల్సాలకు అలావాటు పడిన ఇద్దరు యువకులు పుస్తెల తాడు కోసం వృద్ధ దంపతులను హతమార్చారు. బీర్కూర్‌ మండలం రైతునగర్‌లో దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ డీఎస్పీ కా ర్యాలయంలో శనివారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 25న రైతు నగర్‌లో కిరాణ షాపు నడు పుతూ జీవనం సాగిస్తున్న దారం నారాయణ (75), దారం సులోచన (70) దంపతులు హత్యకు గురయ్యారు.

మృతుడి సోదరుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని ఎస్పీ తెలిపారు. శనివారం దామరంచ గ్రామానికి చెందిన బంగ్లా చింటూ అలియాస్‌ చరణ్‌, అతని తండ్రి బంగ్లా లక్ష్మణ్‌ బీర్కూర్‌లోని బంగారు దుకాణంలో పుస్తెల తాడును విక్రయించే ప్రయత్నం చేయగా పట్టుకున్నట్లు తెలిపారు. వారిని విచారించగా చింటూ తన స్నేహితుడైన ఎర్రోళ్ల నవీన్‌తో కలిసి నారాయణ, సులోచనలను హత్య చేసినట్లు అంగీకరించాడని ఎస్పీ చెప్పారు.

పేకాటతో పాటు ఇతర వ్యసనాలకు అలవాటు పడ్డా చింటూ, నవీన్‌ అప్పుడప్పుడు నారాయణ దుకాణానికి వెళ్లేవారని, సులోచన మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దొంగిలించాలని పథకం వేశారన్నారు. అందులో భాగంగా ఘటన జరిగిన రోజు నిందితులు నారాయణ ఇంటి వెనుకాల నుంచి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారన్నారు. ముందుగా సులోచనను హత్య చేశారని, అనంతరం ముందు గదిలో టీవీ చూస్తున్న నారాయణ వద్దకు వెళ్లి ఆయనను కూడా చంపేశారన్నారు.

సులోచన మెడలో ఉన్న మూడు తులాల బంగారం పుస్తెల తాడును ఎత్తుకెళ్లారని చెప్పారు. పుస్తెల తాడును మూడు ముక్కలు చేసి చింటూ, లక్ష్మణ్‌, నవీన్‌ పంచుకున్నారన్నారు. పుస్తెల తాడును స్వాధీనం చేసుకొని చింటూ, నవీన్‌తో పాటు లక్ష్మణ్‌ను అరెస్ట్‌ చేశామని ఎస్పీ తెలిపారు. నవీన్‌, లక్ష్మణ్‌పై గతంలో పలు కేసులు ఉన్నాయన్నారు.

కేసును ఛేదించిన డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి, బాన్సువాడ రూరల్‌ సీఐ మురళి, పిట్లం, నస్రూల్లాబాద్‌ ఎస్సైలు విజయ్‌, రంజీత్‌రెడ్డి, సీసీఎస్‌ ఎస్సై ఉస్మాన్‌, ఏఎస్సై రాములు, సీసీఎస్‌ ఏఎస్సై రాజేశ్వర్‌, హెచ్‌సీ సురేందర్‌, కానిస్టేబుళ్లు, సుభాష్‌, వస్సీ, సంగమేశ్వర్‌ను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement