‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కవిత మాటలు’ | Sakshi
Sakshi News home page

‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కవిత మాటలు’

Published Sun, Jul 23 2023 12:44 AM

- - Sakshi

నిజామాబాద్‌: అవినీతి గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని నిజామాబాద్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ స్రవంతిరెడ్డి అన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు, ఆమె తండ్రి సీఎంగా ఉన్నా.. జిల్లాలో కవిత చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మాధవ్‌నగర్‌ ఆర్‌వోబీ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్‌ ఈమె కమీషన్లకు భయపడి పారిపోయి న మాట వాస్తవం కాదా అన్నారు.

అర్వింద్‌ ఎంపీ గా గెలిచిన తర్వాత గోవింద్‌పేట ఆర్‌వోబీ పనులు పూర్తి చేయించారని, మాధవ్‌నగర్‌, ఆర్మూర్‌ మామిడిపల్లి, అడవి మామిడిపల్లిలో ఆర్‌వోబీల పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. తాను చేసిన అ వినీతి గురించి అర్వింద్‌ రుజువు చేయాలని, లేకపో తే పూలాంగ్‌ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలన్న కవిత వ్యాఖ్యలపై స్రవంతిరెడ్డి స్పందించారు. ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న సీఎం కేసీఆర్‌ తల నరుక్కోవాలన్నారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసును ఈడీ విచారిస్తుందని, నిందితులు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరైతే భవన నిర్మాణాల పనులు కవిత ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. రింగ్‌ రోడ్డుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే పనులు పూర్తయ్యాయని చెప్పారు. స్పైస్‌ బోర్డు తానే తెచ్చానని కవిత చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అర్వింద్‌ను వెంటాడి ఓడిస్తానన్న కవిత ఇప్పుడు మాట మార్చి, అర్వింద్‌ మీద ఎవరు నిలబడ్డా గెలిపించుకుంటామని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.

ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన సర్వేలో కవిత ఓడిపోతారని తెలవడంతో అర్వింద్‌పై వేరే వారిని పోటీలో దించాలని చూస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే అర్వింద్‌పై పోటీ చేసి గెలవాలన్నారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక, కార్పొరేటర్లు సౌజన్య, మమత, ఇందిరా, నాయకురాలు వరలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.

Advertisement
Advertisement