ఆర్టీసీ ప్రహరీ పనులు ఆపండి
పోరాడతాం..
మానవతా దృక్పథంతో స్థలం వదలాలి
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి వెళ్లే రోడ్డు వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు మూడు వారాలు స్టే విధించినట్లు స్థానికు లు విజయ్ అగర్వాల్ శనివారం తెలిపారు. పట్టణంలోని ఐబీ గెస్ట్‌హౌస్‌ను ఆనుకొని ఉన్న 401/66 సర్వే నెంబర్‌లో గల ప్రభుత్వ భూమిలో 1983– 84లో ఎన్‌టీఆర్ అధికారంలోకి రాగానే 105 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. నాటి నుంచి సుమారు వందకు పైగా కుటుంబాలు ఇళ్లు క ట్టుకొని నివాసముంటున్నాయి.ఈ స్థలానికి ప్లాన్‌లో రోడ్డును సూచించినప్పటికీ ఆ రోడ్డు ఆర్టీసీకి చెందినది కావడంతో నాటి నుంచి వివాదం తలెత్తుతూనే ఉంది. తాజాగా ఆర్టీసీ యాజమాన్యం తమ స్థలాల సంరక్షణలో భాగంగా ప్రహరీ నిర్మిస్తుంటే కాలనీవాసులు అడ్డుకున్నారు. రోడ్డు కోసం 20 ఫీట్ల స్థలాన్ని వదిలేసి ప్రహరీ నిర్మించుకోవాలని ఆర్టీసీ అధికారులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కాలనీవాసులు విన్నవించారు. సమస్య జఠిలం కావడంతో అధికారులు కొద్దిరోజులు నిర్మాణ పనులను నిలిపివేశారు. రోడ్డుకు స్థలం వదలడానికి మొదట అంగీకరించిన ఆర్టీసీ అధికారులు, ఈ మధ్య మళ్లీ నిర్మాణ పనులు చేపట్టాలని సామగ్రిని తరలించారు. దీంతో కాలనీవాసులు విజయ్ అగర్వాల్ సహకారంతో హైకోర్టులో కొద్దిరోజుల క్రితం కేసు వేశారు. శుక్రవారం కేసు బెంచ్‌పైకి రావడంతో వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి మూడు వారాలు స్టే విధించారు. ఎలాంటి నిర్మాణా లు జరపకుండా మూడు వారాలపాటు యథాతదంగా ఉంచాలని, కాలనీవాసుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్, ఆర్టీసీ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు స్టే కాపీ చేతికి అందేలోపే ప్రహరీని నిర్మించాలని శనివారం సన్నద్ధమయ్యారు. బందోబస్తు కోసం పోలీసు అధికారులను సంప్రదించారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు హుటాహుటిన హైదరాబాద్ నుంచి స్టే కాపీ తీసుకొచ్చి ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్‌కు అందజేశారు. దీంతో ప్రహరీ నిర్మాణ పనులను అధికారులు విరమించుకున్నారు. పనులు ఆగిపోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఎన్‌టీఆర్ కాలనీలో పేదలకు కేటాయించిన ఇళ్లకు రోడ్డు లేక ఇక్కట్లు పడుతున్నారు. వారి సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. కానీ, అధికార పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో రాజకీయాలు చేస్తూ కాలనీవాసులను ఇబ్బంది పెడుతున్నారు. కాలనీకి రోడ్డును సాఽధించే వరకు పోరాటం చేస్తాం.
– విజయ్ అగర్వాల్, స్థానికుడు, ఆర్మూర్
ఆర్టీసీ డిపోకు చెందిన స్థలం నుంచే ప్రస్తుతం ప్రజలు నడుస్తున్న జీవన్‌రెడ్డి మార్గ్‌ను నిర్మించారు. ఎన్‌టీఆర్ కాలనీలో సుమారు 100 మంది ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. మానవతా దృక్పథంతో ఆర్టీసీ అధికారులు ఆలోచించి రోడ్డు నిర్మాణానికి సహకరించాలి.
– జాడె శ్రీనివాస్, ఎన్‌టీఆర్ కాలనీ, ఆర్మూర్
స్టే విధించిన హైకోర్టు
ఆర్మూర్ డీఎంకు ప్రతిని అందజేసిన కాలనీవాసులు
రోడ్డు కోసం ఎన్టీఆర్ కాలనీ
ప్రజల పోరాటం
ఆర్టీసీ ప్రహరీ పనులు ఆపండి
ఆర్టీసీ ప్రహరీ పనులు ఆపండి


