వారం రోజుల్లో 97 కేసులు
నిజామాబాద్‌అర్బన్: జిల్లా వ్యాప్తంగా వారం రోజుల్లో 97 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. 97 మందిని కోర్టులో హాజరుపర్చగా రూ.9,40,000 జరిమానా విధించినట్లు వెల్లడించారు. ముగ్గురికి వారం రోజులు జైలు శిక్ష సైతం విధించినట్లు తెలిపారు.
నెమలి మృతి
మాక్లూర్: మండలంలోని బొంకన్‌పల్లి, ముల్లంగి(బి) శివారులోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలో గుట్ట మధ్య శనివారం జాతీయ పక్షి నెమలి మృతిచెందినట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం ఇవ్వటంతో వారు మండల పశువైద్యాధికారి ఉమా సహేర్‌తో వచ్చి నెమలి కళేబరాన్ని పరిశీలించారు. ఆదివారం పోస్టు మార్టం నిర్వహిస్తామని తెలిపారు. అయితే, పంట పొలాలకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన నీటిని తాగటంతో నెమలి మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు.


