ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో గుబులు రేపుతున్న మిలాఖత్‌ వ్యవహారాలు  | - | Sakshi
Sakshi News home page

ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో గుబులు రేపుతున్న మిలాఖత్‌ వ్యవహారాలు 

Jun 18 2023 12:54 AM | Updated on Jun 18 2023 9:03 AM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య ఎత్తులు పైఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు సర్వసాధారణం. ఆయా పార్టీల్లో ప్రత్యర్థి పార్టీల కోవర్టులు సైతం తమ కార్యకలాపాలు నడిపించడం గతంలో అక్కడక్కడా ఉండేది. కాగా ఉమ్మడి జిల్లాలో పస్తుతం ఈ కోవర్టుల సంస్కృతి ఒక వృత్తి మాదిరిగా తయారైనట్లు ఆయా పార్టీల శ్రేణులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కొందరు కాంగ్రెస్‌ నాయకులను కోవర్టులుగా మార్చుకుని పకడ్బందీగా వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. వీటి గురించి కార్యకర్తలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

● నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ, జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు ప్రథమ శ్రేణి నుంచి తృతీయ శ్రేణి నాయకులను బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తమ మనుషులుగా మార్చుకున్నట్లు కాంగ్రెస్‌ కార్యకర్తలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.

● నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో పలువురు ప్రథమ శ్రేణి కాంగ్రెస్‌నాయకులు అధికారపార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధితో కలిసి తమ వ్యవహారాలను దర్జాగా చక్కబెట్టుకుంటున్న విషయం బహిరంగ రహస్యమైంది. కొందరు కాంగ్రెస్‌ నాయకులైతే ఏకంగా సదరు కీలక ప్రజాప్రతినిధి వద్ద ప్రతినెలా డబ్బులు తీసుకుంటున్నట్లు గుసగుసలు వినిపి స్తున్నాయి. ఇక ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు, చెరువులు, కెనాల్స్‌ ఆక్రమించి అక్రమంగా వేస్తున్న వెంచర్లలో సైతం బీఆర్‌ఎస్‌, ఎంఐఎం నాయకులతో క లిసి వాటాలు పంచుకుంటున్నట్లు సమాచారం.

అదేవిధంగా వివిధ వ్యాపారాలు, మడిగెలు పొందడం, వైన్స్‌ల్లో భాగస్వామ్యం తదితర వ్యవహారాలను దర్జాగా చేసుకుంటున్నారు. గుట్టలు కూడా కలసికట్టుగా స్వాహా చేసి మొరం అమ్ముకున్నట్లు కిందిస్థాయి కార్యకర్తలు చెబుతున్నారు. చివరకు అర్బన్‌ నియోజకవర్గంలో హాథ్‌సే హాథ్‌ జోడో యాత్రకు సైతం బీఆర్‌ఎస్‌ నుంచి స్పాన్సర్‌ పొందుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకలాపాలకు బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు పెట్టుబడి పెట్టడమేమిటంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ, ఎంఐఎం పార్టీలపై విమర్శలు చేయవద్దంటూ ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్‌ నాయకులు ద్వితీయ శ్రేణి నాయకులకు సూచిస్తుండడం గమనార్హం.

● నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో కొందరు ప్రథమ శ్రేణి నాయకులు అధికార పార్టీతో సఖ్యతగా ఉంటూ కాంగ్రెస్‌కు గండికొట్టేలా వ్యవహరిస్తున్నారంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గంలో అంతగా ప్రాధాన్యత లేని కాంగ్రెస్‌ నాయకుడిని బీఆర్‌ఎస్‌ ప్రోత్సహిస్తుండడం విశేషం.

● జహీరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల్లో సైతం ప్రథమ శ్రేణి కాంగ్రెస్‌ నాయకులకు ఒక జాతీయ స్థాయి బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల కేటాయింపు విషయంలో ఏవిధంగా ముందుకు వెళ్లాలంటూ పీసీసీ నేతలు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కోవర్టులున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఎన్నికల బరిలో ఏవిధంగా ఎదుర్కోవాలంటూ పీసీసీ నాయకత్వం తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక విజయోత్సాహం నీరుగారిపోతోందని కొందరు సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement