ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేయాలి
రుద్రూర్ : శిక్షణ పొందిన మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులకు తెలియజేసి ఆ దిశగా ప్రోత్సహించాలని కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా.టి.సుప్రజ సూచించారు. రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్తంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్టులో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పూర్తిచేసిన కృషి సఖిలకు మంగళవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోఆర్డినేటర్ మాట్లాడుతూ రైతులు ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఆహార సాంకేతిక కళాశాల అసోసియేట్ డీన్ డా. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా భావితరాలకు ఆరోగ్యవంతమైన నేలతోపాటు నాణ్యమైన ఆహారాన్ని అందించవచ్చని అన్నారు. కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త డా.ఎం.శ్వేత, వ్యవసాయాధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


