పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
● తొలిరోజు ఇద్దరు విద్యార్థుల డిబార్
తెయూ (డిచ్‌పల్లి) : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయంలోని పరీక్ష కేంద్రాన్ని వైస్ చాన్సలర్ యాదగిరిరావు, కళాశాల ప్రిన్సిపల్ రాంబాబు, పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్‌తో కలిసి తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అబ్జర్వర్లకు సూచించారు. పరీక్షలకు మొత్తం 1,981 విద్యార్థులకు 1,902 మంది హాజరుకాగా 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కాగా, తొలిరోజే ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి డిబార్‌కు గురైనట్లు ఆయన వివరించారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఆకాశవాణి రిలే కేంద్రంలో మంగళవారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కేంద్రం ఆవరణలోని గడ్డి, ఇతర వ్యర్థాలకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నిజామాబాద్ రూరల్ : మండలంలోని మల్కాపూర్ (ఎ) గ్రామంలో ఉన్న అనంత పద్మానాభ స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మల్కాపూర్(ఎ),లక్ష్మాపూర్, అనంతగిరి, ధర్మారం గ్రామాల ఆధ్వర్యంలో 28 సంవత్సరాల నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మాకునూరి వెంకటరమణా చార్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం అంకురారోహణ, ఋత్వికుల దీక్షాధారణ, హారతి, మంత్ర పుష్పం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 5న సుప్రభాత సేవ, అభిషేకం, సుదర్శన కలశ ప్రతిష్ట, ధ్వజారోహరణ, నైవేద్యం, హారతి, తీర్థ, ప్రసాద వితరణ, సాయంత్రం హోమం, బలిప్రదాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 7న డోలారోహణం, 8న శ్రీ లక్ష్మీ అనంత పద్మానాభ స్వామి రథోత్సవం, 9న చక్రతీర్థం, పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు సంపూర్ణమవుతాయని తెలిపారు.
పిట్లం(జుక్కల్): మండల కేంద్రమైన పిట్లంలో సోమవారం రాత్రి జరిగిన బైక్ చోరీపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బాన్సువాడ నుంచి వచ్చిన క్లూస్ టీం అధికారి ప్రవీణ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి, వేలిముద్రలు సేకరించారు. ఆయన వెంట పిట్లం ఎస్సై వెంకట్రావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం


