నిర్మల్: నిర్మల్ గొలుసుకట్టు చెరువులకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇలాంటి జలసంపద దాదాపు ఎక్కడా లేదు. ఒకదాని తర్వాత ఒకటి గొలుసులా పదికి పైగా చెరువులు జిల్లాకేంద్రం చుట్టూ ఉన్నాయి. ఒకప్పుడు వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచుతూ.. పట్టణానికి పచ్చదనాన్ని, ఆహ్లాదాన్ని అందించిన ఈ జలవనరులు ఇప్పుడు ఉనికి కోల్పోతున్నాయి. ఆక్రమణదారుల కబంధహస్తాల్లో చిక్కుకుని కుంచించుకుపోతూ.. మరోవైపు మురుగు కాల్వల నీటితో కంపుకొడుతున్నాయి. చెరువుల శిఖం భూములు క్రమంగా అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. హైదరాబాద్‌లో హైడ్రా ఆధ్వర్యంలో చెరువుల పరిరక్షణ, సుందరీకరణ చర్యలు చేపడుతుంటే.. నిర్మల్‌లో మాత్రం ఉన్న జలవనరులు కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్నేళ్ల తర్వాత నిర్మల్‌లో నీటికష్టాలు తప్పవన్న ఆందోళనా ప్రజల్లో ఉంది.
గొలుసుకట్టుతోనే..
ఎన్నేళ్లయినా ప్రజలకు నీటికష్టాలు రావద్దన్న సదుద్దేశంతో 450 ఏళ్లక్రితం అప్పటి పాలకులు నిర్మల్‌లో గొలుసుకట్టు చెరువులను తవ్వించారు. అప్పటి పాలకుల ముందుచూపు కారణంగా ఇప్పటికీ నిర్మల్‌లో నీటికష్టం అనే మాట కూడా వినిపించదు. ఇక్కడ కేవలం 20–40ఫీట్ల లోతులోనే పాతాళగంగ పలకరిస్తుంది. ఎక్కడా లేనివిధంగా నిర్మల్‌లో పుష్కలంగా భూగర్భ జలాలు ఉండటానికి ఇక్కడి గొలుసుకట్టు చెరువులే కారణం. అలాంటి చెరువులంటే లెక్కలేకుండా పోతోంది.
బాధ్యత లేకుండా..
జిల్లాకేంద్రంలోని తల్లిలాంటి గొలుసుకట్టు చెరువులను చేతులారా నాశనం చేస్తున్నారు. కొంతమంది తమ స్వార్థం కోసం చెరువుల శిఖం భూములను, బఫర్‌జోన్లను, క్యాచ్‌మెంట్ ఏరియాలను, ఫుల్‌ట్యాంక్ లెవల్‌లనూ మార్చేస్తున్నారు. చెరువు గర్భం వరకూ మట్టిని నింపేసి, వాటిలో వెంచర్లు వేసి అమ్మేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏది చెరువు, దాని శిఖం ఎక్కడి వరకు ఉంది. ఎఫ్‌టీఎల్‌లో ప్లాట్లను చేస్తున్నారా.. ఇలాంటివేవీ చూడకుండానే సంబంధిత అధికారులు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ధర్మసాగర్ చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలను చేపడుతుంటే స్వయంగా కలెక్టర్ భవేశ్‌మిశ్రా వెళ్లి తొలగింపజేయాల్సి వచ్చింది.
మన దగ్గర మార్పు ఎప్పుడో..
చెరువుల పునరుద్ధరణకు కేవలం పూడికతీత, సుందరీకరణ పనులు చేపడితే సరిపోదు. ముందుగా సమగ్ర సర్వే నిర్వహించి వాటిల్లోని ఆక్రమణలను గుర్తించాలి. హైడ్రా తరహాలో వాటన్నింటినీ పూర్తిగా తొలగించాలి. మురుగు నీరు చెరువుల్లోకి చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. నీటి ప్రవాహ మార్గాలకు అడ్డంకులు తొలగించాలి. హైదరాబాద్‌లో చేసినట్లే ఇక్కడా.. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, పచ్చదనం అభివృద్ధి చేయాలి. ఇందుకు హైడ్రానే రావాల్సిన అవసరం లేదు. సంబంధిత శాఖలు సమన్వయంతో పక్కాగా పనిచేసినా గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం సాధ్యమవుతుందన్న వాదన ఉంది. లేదంటే భావితరాలకు చెరువుల ఆనవాళ్లు కూడా మిగలని పరిస్థితి ఏర్పడే ప్రమాదమూ ఉందన్న ఆందోళన కూడా ఉంది.
ఈ చిత్రంలో ఉన్న చెరువు నిర్మల్‌లోని గొలుసుకట్టు జలవనరుల్లో ఒకటైన రాంసాగర్. మంజులాపూర్–ప్రియదర్శినినగర్‌ల మధ్యలో గల ఈ చెరువు చుట్టూ చెరబట్టారు. చిన్నరాంసాగర్‌ను చిన్నబోయేలా చేశారు. ఇక్కడ ఇరిగేషన్ వారు పెట్టిన హద్దులను సైతం చెరిపేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక డ్రైనేజీ నీటితో ఓ పెద్ద మురికికూపంలా మారుతోంది. ‘మనకెప్పుడు హైడ్రా వస్తుందా..!’ అని మార్పు కోసం ఎదురుచూస్తోంది.


