నిర్మల్‌చైన్‌గేట్: మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జిల్లా ప్రసూతి ఆస్పత్రి ఎదుట కాంట్రాక్టు కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ఎస్ విలాస్, జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా రమేశ్ ధర్నాలో పాల్గొని మాట్లాడారు. కార్మికులకు ప్రతి నెలా 5వ తేదీ నాటికే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు ఇంకా చెల్లించలేదన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని కోరారు. సోమవారంలోగా పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ‘చలో కలెక్టరేట్’ నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాజేందర్, సాయి, పోశెట్టి, సరస్వతి, భాగ్యలక్ష్మి, సంగీత కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.


