నిమజ్జనానికి వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి వేళాయె..

Sep 25 2026 2:05 AM | Updated on Sep 25 2026 2:05 AM

● నేడు జిల్లా కేంద్రంలో నిమజ్జనోత్సవం ● మొత్తం 49 వినాయక విగ్రహాలు ● బంగల్‌ చెరువులో నిమజ్జన ఏర్పాట్లు

నిర్మల్‌: నిర్మల్‌లో గణేశ్‌ నిమజ్జనోత్సవానికి వేళయింది. అంగరంగ వైభవంగా గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చేందుకు సర్వం సన్నద్ధమైంది. ఈ ఉత్సవ ఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తిచేసేందుకు నిర్మల్‌ మున్సిపాలిటీ, జిల్లా అధికారులు, వివిధ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేశాయి. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసింది. గణనాథులకు స్వాగతం పలుకుతూ సాగనంపేందుకు గణేశ్‌ ఉత్సవకమిటీ సిద్ధమైంది.

భారీ శోభాయాత్ర..

నిర్మల్‌లో గణేశ్‌ శోభాయాత్ర రెండురోజులపాటు సాగుతుంది. మొత్తం 51 మండపాలు ఉండగా, ఈసారి 49 చోట్ల భారీ వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. స్థానిక బుధవార్‌పేట్‌లో మొదటి నంబర్‌ నుంచి వినాయక శోభాయాత్ర ప్రారంభమవుతుంది. నంబర్ల వారీగా వరుసగా ట్రాక్టర్లు, డీజేలు, భాజాభజంత్రీలతో కోలాహలంగా ముందుకు సాగుతుంది. బంగల్‌పేట్‌ చివరలో గల బంగల్‌చెరువు(వినాయక సాగర్‌)లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

పూజలతో ప్రారంభం..

నిర్మల్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవాన్ని బుధవార్‌పేట్‌ నంబర్‌వన్‌ గణేశుడి నుంచి ప్రారంభిస్తారు. స్థానిక ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్యగణేశ్‌చక్రవర్తి, కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా, ఎస్పీ జానకీషర్మిల అథితులుగా హాజరు కానున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి స్థానిక నగరేశ్వరవాడ చౌరాస్తాలో వినాయక శోభాయాత్రకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులు స్వాగతం పలకనున్నారు.

బంగల్‌ చెరువులో నిమజ్జనం..

జిల్లాకేంద్రం శివారులో గల బంగల్‌చెరువు(వినాయక సాగర్‌)లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సంబంధించి చెరువు కట్టపై ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒక భారీ క్రేన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు మరో క్రేన్‌ను అదనంగా అందుబాటులో ఉంచారు. చెరువులో భారీగా నీరు ఉండటంతో ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దారి పొడవునా ఉన్నతాధికారులు, సిబ్బందిని భారీగా మోహరించారు. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో అదనపు స్తంభాలు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర పూర్తయ్యేదాకా శాఖాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో కట్ట వద్ద అన్నదానం, దారి పొడవునా మంచినీటి వసతి, గుంతలు లేకుండా రోడ్లపై ఏర్పాట్లు చేశారు.

నిర్మల్‌ పట్టణంలోని వినాయకసాగర్‌ వద్ద ఏర్పాట్లు

ప్రధాన రహదారిపై

వీధిదీపాలు వెలగక ఉన్న చీకట్లు

రూట్‌మ్యాప్‌ ఇలా..

బుధవార్‌పేట్‌ నుంచి ప్రారంభమయ్యే శోభా యాత్ర వివిధ వీధుల గుండా బంగల్‌పేట్‌ వరకు సాగుతుంది. నంబర్ల వారీగా ఆయా వీధుల గణనాథులు శోభాయాత్రలోకి వస్తుంటాయి. బుధవార్‌పేట్‌–పింజరిగుట్ట–పాతబస్టాండ్‌–వివేక్‌చౌక్‌–ఎన్‌హెచ్‌–7– జయశంకర్‌చౌరాస్తా–నగరేశ్వర్‌వాడ–సునార్‌గల్లీ–ద్యాగవాడ–పెద్దమార్కెట్‌–పట్టణ పోలీస్‌స్టేషన్‌–సోమవార్‌పేట్‌–గాంధీచౌక్‌–జుమ్మెరాత్‌పేట్‌–నాయుడివాడ–బేస్తవార్‌పేట్‌–బంగల్‌పేట్‌–బంగల్‌చెరువు(వినాయక సాగర్‌).

ఖానాపూర్‌లో అరకొర పనులు..

ఖానాపూర్‌: పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవం శుక్రవారం జరగనుంది. అన్ని వార్డులకు చెందిన వినాయక విగ్రహాలను స్థానిక గోదావరిలో నిమజ్జనం చేయనున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి ఇరుకుగా ఉండటం, ఇతర రహదారులు మిషన్‌ భగీరథ, అమృత్‌–2 పనులతో గుంతలమయంగా మారాయి.

కొట్టుకుపోయిన మొరం..

ఇటీవల మున్సిపల్‌ అధికారులు రహదారులపై ఉన్న గుంతల్లో మొరం పోశారు. అయితే వర్షాలకు మొరం కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వినాయక విగ్రహాలతో శోభాయాత్రగా వెళ్లే భక్తులు, నిర్వాహకులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గురువారం శాంతినగర్‌ ప్రధాన రహదారిపై బస్సు దిగబడింది.

మార్గంలో చిమ్మచీకట్లు...

పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు మధ్యలో నిలి చిపోవడం, రాత్రివేళల్లో వెలగని వీధి దీపాలతో మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లైటింగ్‌ స్తంభాల్లో చాలా వరకు దీపాలు వెలగడం లేదు.

గోదావరి వద్ద ఏర్పాట్లు

మరోవైపు గోదావరి వద్ద మున్సిపల్‌ ఆధ్వర్యంలో నిమజ్జనానికి ఏర్పాట్లు చేపట్టారు. క్రేన్‌ ఏర్పాటు చేశారు. నిమజ్జనోత్సవం సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement