సారంగపూర్: అడవులను రక్షిస్తేనే పశుపక్షాదులతోపాటు మానవాళి మనుగడకు ఎలాంటి హానీ ఉండదని ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయం పక్కన అడెల్లి నందనవనంలో అటవీశాఖ ఆధ్వర్యంలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. విద్యార్థులు, స్థానికుల భాగస్వామ్యంతో మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే పర్యావరణ సమతుల్యత ఏర్పడి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవనం సాగించగలుగుతామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌తో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. అనంతరం కళాజాత బృందం ఆధ్వర్యంలో ప్రజలకు పర్యావరణం, అడవుల ప్రాముఖ్యత తదితర అంశాలపై చక్కని పాటల ద్వారా అవగాహన పెంపొందించారు. కార్యక్రమంలో సీసీఎఫ్ అపర్ణ, డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్పీ శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్, సారంగాపూర్, అడెల్లి సర్పంచులు కూనేరు భూమన్న, దండు సాయన్న, స్థానికులు, విద్యార్థులు, అటవీశాఖ, పోలీసులు పాల్గొన్నారు.


