ఖానాపూర్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో ‘సున్హరి మిట్టి అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ప్రకృతి పద్ధతిలో పసుపు సాగు చేస్తున్న రైతులతో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సమావేశమయ్యారు. అదే సందర్భంగా మార్కెట్ అనుసంధాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
రైతుల భాగస్వామ్యం
ఖానాపూర్ మండలం సింగపూర్ గోండుగూడకు చెందిన రైతులు ఆదిలాబాద్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ చైర్మన్ సిడాం ఆనందరావు ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ మార్గదర్శకత్వంలో పసుపు సాగు చేస్తున్న రైతులు కర్కూరి గంగామణి, సిడం గంగా ప్రసాద్ తమ సాగు విధానాలను గవర్నర్‌కు వివరించారు. ఈ సదర్భంగా ఖరీఫ్ సీజన్ నాటికి 100 ఎకరాలకు పైగా ప్రకృతి పద్ధతిలో పసుపు సాగు చేసేందుకు సమావేశంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, కార్యదర్శి భవానిశ్రీ, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పసుపు బోర్డు డిప్యూటీ డైరెక్టర్ ప్రత్యూష్ పాల్గొన్నారు.
కొరిటికల్ రైతులకు..
మామడ: నిజామాబాద్‌లో సున్హరి మిట్టి అభియాన్ కార్యక్రమంలో మామడ మండలం కొరిటిల్ పసుపు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రైతులు పాల్గొన్నారు. ప్రకృతి పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న కొరిటికల్ రైతులకు గవర్నర్ అభినందించారు. కార్యక్రమంలో పసుపు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ సామల భీంరెడ్డి, వైస్ చైర్మన్ ఏలూరు రాజారెడ్డి, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, గంగన్న పాల్గొన్నారు.


