నిర్మల్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానంతో మాల విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్ ప్రమాదంలో పడిందని మాల కోఆర్డినేషన్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్ అన్నారు. రోస్టర్ పాయింట్ సవరించాలని డిమాండ్ చేస్తూ.. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవో భవన్‌లో ఆదివారం జిల్లా సదస్సు నిర్వహించారు. గోపీనాథ్ మాట్లాడుతూ.. మాలలంతా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం ఉద్యమించాలన్నారు. మాలలకు విద్య ఉద్యోగ నియామకాలంలో రోస్టర్ పాయింట్ 22 కేటాయించడంతో భవిష్యత్తులో మాల విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని పేర్కొన్నారు. రోస్టర్ పాయింట్ సవరించే వరకు అంబేడ్కర్, పూలే ఆశయాలతో పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకుడు పి.శంకర్ మా ట్లాడుతూ.. గతంలో జరిగిన అన్యాయాలపై మాలలు మౌనం వహించడం వల్లే నష్టం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శకుంతల, తిరుపతయ్య , జిల్లా నాయకులు బత్తుల రంజిత్, డాక్టర్ సురేశ్, డాక్టర్ రమేశ్, డాక్టర్ దామెర రాములు, ముత్యం, జిల్లా మాల నాయకులు పాల్గొన్నారు.


