● బానిసలవుతున్న బడి విద్యార్థులు!
నిర్మల్: యువతరం భయంకరమైన ‘మత్తు’లో కూరుకుపోతోంది. ఇప్పటికే 30–40శాతం గంజాయికి బానిసగా మారింది. టీనేజర్స్‌ను దాటి ఈ మత్తుమందు బడిపిల్లల చేతుల్లోకీ చేరడం భయాందోళన కలిగిస్తోంది. గ‘మ్మత్తు’గా ఉంటుందంటూ పీలుస్తున్న యువత ఆ మత్తులో ఏం చేస్తున్నారో.. ఏమైపోతున్నారో.. కూడా తెలియడం లేదు. జిల్లాలో ఇప్పటికే గంజాయి కారణంగా చాలామంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రాణాలను తీసి జైలు పాలయ్యారు. బానిసలుగా, బాధితులుగా మారి నిండు జీవితాలను కోల్పోతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని బడిపిల్లలే దారుణంగా హతమార్చడం యావత్ సమాజాన్ని నివ్వెరపర్చింది. సదరు విద్యార్థులు గంజాయికి బానిసలు కావడమే ఈ ఘటనకు దారితీసినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల తర్వాత దైవంతో సమానమైన, తమ ఉన్నతిని కోరుకునే గురువును దారుణంగా చంపడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా గంజాయి మత్తుపై పెద్దఎత్తున చర్యలు చేపట్టాలన్న డిమాండ్ జిల్లా వ్యాప్తంగా బలంగా వస్తోంది.
విచక్షణ కోల్పోతూ..
గంజాయి మత్తు విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. కోపం, ఆవేశం, నిర్లక్ష్య ప్రవర్తనకు దారితీస్తుంది. తాజాగా నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు చేసిన దర్యాప్తులో ఆమె పాఠశాలలో చదివిన పదోతరగతి విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు తేలడం కలవరపెట్టింది. ఈ ఘటన నేపథ్యంలో చిన్న వయసులోనే నేర ప్రవృత్తి, మత్తు పదార్థాలు, సోషల్ మీడియా ప్రభావం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలైంది.
చిన్న వయసులోనే మత్తు
చేతిలో స్మార్ట్‌ఫోన్.. అందుబాటులో మత్తు పదార్థాలు.. ఇవే చిన్నవయసులో యువత, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. తెలిసీతెలియని వయసులో ఆ మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొందరు విద్యార్థులు స్నేహితులు, కాలనీలో ఉండే యువకుల ప్రభావంతో గంజాయి వంటి మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతుండగా, మరికొన్ని చోట్ల గంజాయి విక్రేతలు తక్కువ ధరకు అందిస్తూ వారు మత్తుకు బానిసలయ్యేలా చేస్తున్నారు. జిల్లాలో పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లోనూ సరైన నిఘా లేకపోవడంతో గంజాయి వంటి భయంకరమైన మత్తుపదార్థాల అమ్మకాలూ యథేచ్ఛగా సాగుతున్నాయి.
కట్టడి చేయాల్సిందే..
గంజాయి వంటి మత్తు పదార్థాల సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది? ఎవరు విక్రయిస్తున్నారు? యువత, విద్యార్థులకు ఎలా చేరుతోంది? అనే అంశాలపై పోలీసులు, అబ్కారీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో నిఘా పెంచడంతో పాటు అనుమానాస్పద ప్రాంతాలను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలంటున్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉండాలని, వారితో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మంచిమార్గంలో తీసుకెళ్లాలని సైకియాట్రిస్టులు సూచిస్తున్నారు.


