భైంసా: ఎరువుల కొరతకు చెక్ పెట్టడంతో పాటు విచ్చలవిడిగా వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్‌లో బుకింగ్ విధానం రైతులను తిప్పలు పెడుతోంది. ఇప్పటివరకు యూరియా మాత్రమే యాప్‌లో బుక్ చేసుకోవాల్సి ఉండగా ఈ నెల 17నుంచి అన్ని రకాల ఎరువులను ఈ విధానంలో బుక్ చేసుకోవాలనే నిబంధనలు అమల్లోకి వచ్చాయి. విధానం మంచిదే అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగంపై అవగాహన లేని రైతులకు ఇబ్బందిగా మారింది. ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయడం, ఓపెన్ చేయడం, మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవడం, వివరాలు నమోదు చేయడం, ఎరువులను ఎంపిక చేసుకుని బుకింగ్ చేయడం లాంటి ప్రక్రియపై అవగాహన లేని రైతులే చాలామంది ఉన్నారు. కొందరు రైతులు తమ పిల్లలు, బంధువులు, యువ రైతుల సహాయం తీసుకుంటున్నారు. కొన్నిచోట్ల రైతు సేవా కేంద్రాలు, ఎరువుల దుకాణాల వద్దే ఇతరుల ఫోన్లతో బుకింగ్ చేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే రైతులకు ఈ కొత్త ప్రక్రియ భారంగా మారింది.
టెక్నికల్ సమస్యలతో సతమతం
ఎరువులు తీసుకునేందుకు దుకాణానికి వెళ్లిన తర్వాత యాప్‌లో బుకింగ్ కాలేదని తెలిసినా రైతులకు ఇబ్బంది తప్పడం లేదు. నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు, యాప్ పని చేయకపోవడం లాంటి సమస్యలు ఎదురైతే మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎరువులు ఎక్కడ, ఎప్పుడు తీసుకోవాలి.. అనే విషయంపై కూడా స్పష్టత లేకపోతే రైతులు మళ్లీ దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు యాప్ విధానం మరింత ఇబ్బందికరంగా మారే అవకాశముంది. కొత్త యాప్ విధానంపై గ్రామస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.
ఎరువుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. అవసరానికి మించి ఎరువుల కొ నుగోలును నియంత్రించడం, కృత్రిమ కొరతకు అ డ్డుకట్ట వేయడానికే యాప్ విధానం అమలు చేస్తున్నాం. వినియోగంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తాం.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయాధికారి


