పసుపు సాగుకు ఆదరణ | - | Sakshi
Sakshi News home page

పసుపు సాగుకు ఆదరణ

Aug 21 2026 9:38 AM | Updated on Aug 21 2026 9:38 AM

● ధర పెరగడంతో అన్నదాతల ఆసక్తి ● జిల్లాలో క్రమంగా పెరుగుతున్న సాగు

లక్ష్మణచాంద: పసుపు సాగుకు జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి ఖర్చులు అధికమై పంటకు సరైన ధర లేక 2021–24 వరకు జిల్లాలో పసుపు సాగు అంతంత మాత్రంగానే ఉండేది. 2021–22లో 13,671 ఎకరాలు, 2022–23లో 11,797, 2023–24లో 5,450 ఎకరాల్లో రైతులు పసుపు సాగు చేశారు. అప్పట్లో ధర అంతగా లేకపోవడంతో సాగు తగ్గుతూ వచ్చింది. దీంతో రెండేళ్లుగా పసుపు సాగు నిలకడగా ఉన్నట్లు హార్టికల్చర్‌ అధికారులు తెలిపారు. 2024–25లో 5,542 ఎకరాలు, 2025–26లో 5,550 ఎకరాల్లో సాగవుతున్నట్లు పేర్కొన్నారు. ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా పసుపు సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 4వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు కోసం రైతుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దీంతో వచ్చే ఏడాది మరింత పసుపు సాగు పెరగనుందని చెబుతున్నారు. ఈసారి మామడ మండలంలో అత్యధికంగా 1,307 ఎకరాల్లో పసుపు సాగవుతుండగా, రెండో స్థానంలో లక్ష్మణచాంద మండలంలో 1,213 ఎకరాలు, అత్యల్పంగా నిర్మల్‌ అర్బన్‌ మండలంలో నాలుగెకరాల్లో సాగవుతోంది. మూడేళ్ల క్రితం క్వింటాల్‌ పసుపునకు రూ.6వేలు మాత్రమే ఉండగా, గతేడాది రూ.14వేలు పలికింది. గతంతో పోల్చితే ధర ఆశాజనకంగా ఉండటంతోపాటు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో రైతులు క్రమంగా పసుపు సాగు పెంచుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

గతేడాది ధర బాగుండడంతో..

గతంలో ధర లేక పసుపు సాగు చేయడం మానేసిన. కానీ, గతేడాది ధర రూ.14వేల వరకు వచ్చింది. దీంతో ఈసారి ఎకరంలో పసుపు సాగు చేస్తున్న.

– గంగారెడ్డి, చామన్‌పెల్లి

సాగు మరింత పెరగనుంది

ఆయిల్‌పామ్‌పై ఆసక్తి చూపుతున్న రైతులకు అంతరపంటగా పసుపు సాగు చేయాలని సూచిస్తున్నాం. ఈసారి 5,550 ఎకరాల్లో పసుపు సాగవుతుండగా వచ్చే ఏడాది పెరగనుంది. – బీవీ రమణ,

జిల్లా హార్టికల్చర్‌, సెరికల్చర్‌ అధికారి

మార్కెట్‌ సౌకర్యం ఉంటే మేలు

ఈ ఏడాది నాలుగెకరాల్లో సాగు చేసిన. నిజామాబాద్‌లో పంట అమ్ముకోవడం కష్టంగా ఉంది. నిర్మల్‌లో పసుపు మార్కెట్‌ ఏ ర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.

– అశోక్‌, చింతల్‌చాంద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement