ఖానాపూర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నియమితులైన సమాచార, సమాచార సాంకేతిక పరిజ్ఞాన బోధకులకు నిర్వహించిన నాలుగు రోజుల రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో ఖానాపూర్ మండలం మస్కాపూర్ పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ గణిత ఉపాధ్యాయుడు సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీమ్ రాష్ట్రస్థాయి శిక్షకుడిగా సేవలందించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఆగస్టు 11 నుంచి 14 వరకు డిజిటల్ అభ్యసనంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షకుడిగా సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీమ్ వివిధ శిక్షణా తరగతులు నిర్వహిస్తూ తన అనుభవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని శిక్షణార్థులతో పంచుకున్నారు. సమగ్ర శిక్ష తెలంగాణ అదనపు రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ పీవీ.శ్రీహరి, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ఆయన సేవలను అభినందించారు. నిర్మల్ డీఈవో భోజన్న, పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్ మస్కాపూర్ హెచ్‌ఎం శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు సయ్యద్ ఫరాజ్ అబ్దుల్ కరీమ్‌ను అభినందించారు.


