నిర్మల్‌చైన్‌గేట్: ఉత్తరాఖండ్ హల్ద్వాని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, దళిత నేత మల్లికార్జున ఖర్గే ప్రసంగం అనంతరం మైదానాన్ని శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ నిర్మల్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెరుపు నిరసన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బీఆర్.అంబేడ్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి బైఠాయించారు. మోదీ హఠావో దేశ్‌కి బచావో.. అంటూ నినాదాలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ మల్లికార్జున ఖర్గే దళితుడు అన్న కారణంగా బీజేపీ శుద్ధీకరణ చేపట్టడం రాజ్యాంగ హక్కును కాలరాసేలా ఉందని విమర్శించారు. ఈ సంఘటనతో బీజేపీ అగ్రవర్ణాల పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


