నర్సాపూర్(జి): మండలంలోని టెంబుర్నిలో గ్రామ పంచాయతీకి కేటాయించిన స్థలంలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని అధికారులు గురువారం కూల్చి వేయించారు. గతంలో గ్రామపంచాయతీ నిర్మాణానికి ఈ స్థలాన్ని కేటాయించారు. అయితే కొందరు దీనిని ఆక్రమించగా.. 2022లో ఈ అంశంపై కేసు నమోదైంది. గ్రామానికి చెందిన లోస్ర గంగాధర్ ఆ స్థలాన్ని మారెడ్డి అనూషకు అక్రమంగా విక్రయించాడు. మారెడ్డి అనూష గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అదే స్థలంలో నిర్మాణం చేపట్టారు. దీనిపై పంచాయతీ అధికారులు రెండు నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. జిల్లా న్యాయస్థానం అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చివేయాలని తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ 2018 చట్టం ప్రకారం గురువారం కూల్చివేత చేపట్టినట్లు ఎంపీవో తిరుపతిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ, పంచాయతీ స్థలాలను ఆక్రమించి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మల లలిత, ఉపసర్పంచ్ బ్యాగరి ముత్తన్న, కార్యదర్శి కపిలారాణి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


