మన్నించు రాంజీ.. | - | Sakshi
Sakshi News home page

మన్నించు రాంజీ..

Aug 14 2026 7:50 AM | Updated on Aug 14 2026 7:50 AM

● ప్రాణత్యాగాలకూ గుర్తింపు లేదు ● పోరువీరులను పట్టించుకోని పాలకులు ● ఘనచరిత్ర గుర్తించని అధికారులు

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలో చైన్‌గేట్‌ వద్ద కుమురంభీం విగ్రహం పక్కనే బుర్ర మీసాలు, పట్టు కాసు, విల్లంబులతో నిలబడి ఉన్న వీరుడు రాంజీగోండు. ఈ గడ్డపై ఆంగ్లేయులను, నిజాం పాలకులను గడగడలాడించిన పోరుబిడ్డ. వేలాది వీరులను తయారుచేసి చెట్లు, కొండకోనలను రక్షణగా చేసుకుని అలుపెరుగకుండా పోరాడాడు. చివరకు వెయ్యిమంది వీరులతో కలిసి ఒకే మర్రిచెట్టుకు ప్రాణాలర్పించాడు. ఆ పోరాటం వినగానే ఒళ్లు గగ్గుర్లుపొడుస్తుంది. మన గడ్డకు ఇంతటి గొప్ప చరిత్ర ఉందన్న గర్వంతో గుండె ఉప్పొంగుతుంది.

పోరు నేర్పిన వీరుడు

నిర్మల్‌ కేవలం కొయ్యబొమ్మలు, కోటలు, నదుల ప్రాంతం కాదు. పరాయి పాలనను ఎదురించి ప్రా ణాలను త్యాగం చేసిన అమరవీరుల నేల. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలోనే ఈ ప్రాంతం పాల్గొన్న ఘనత ఉంది. గోండురాజు రాంజీగోండు నాయకత్వంలో ఆంగ్లేయులు, హైదరాబాద్‌ పాలకులపై ఏకకాలంలో పోరాటం సాగింది. అడవి బిడ్డలను ఏకం చేసి అడవులు, గుట్టలు, గోదావరిని అనుకూలంగా మలుచుకుని యుద్ధం చేశాడు.

చిరునవ్వుతో ఉరికొయ్యలకు

రోజుల తరబడి శత్రువులకు ముప్పు తెచ్చిన రాంజీ సహా వెయ్యిమంది వీరులు దొంగదెబ్బతో పట్టుబ డ్డారు. నిర్మల్‌–ఎల్లపెల్లి మార్గంలోని మహా మర్రిచెట్టుకు వారినందరినీ ఒకేసారి ఉరితీశారు. ఇలాంటి ఘటన దేశ చరిత్రలోనే అరుదు. చిరునవ్వుతో ఉరి కొయ్యలను ముద్దాడిన ఆ వీరుల స్ఫూర్తి తర్వాత కుమురంభీం లాంటి యోధులకు ప్రేరణైంది.

నివాళులైనా అర్పించలేమా?

ప్రాణ త్యాగం చేసిన వీరులను తలుచుకుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. చైన్‌గేట్‌ వద్ద విగ్రహం, ఎల్లపెల్లి మార్గంలో స్థూపం ఉన్నా, చుట్టూ బండ్లు, బజ్జీలు, మందు సేవనం జరుగుతోంది. మర్రిచెట్టు కూలిపోయింది. స్వా తంత్య్ర దినోత్సవం రోజునైనా నివాళులు అ ర్పించడం లేదు. ముందుతరానికి వారి కథ చెప్పడం లేదు. పాలకులు, అధికారులు, స్థా నికులు నీ విగ్రహం ముందు తిరుగుతున్నా నీ త్యాగాన్ని గుర్తించలేదు. నీ స్థూపాన్ని అవమానిస్తున్నారు. మా నిర్లక్ష్యాన్ని పెద్దమనసుతో మన్నించు రాంజీ అని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement