న్యూస్‌రీల్
నిర్మల్
రీసర్వే పనుల పరిశీలన
సారంగపూర్: మండలంలోని నాగాపూర్ తండా రెవెన్యూ రికార్డుల్లో లేకపోవడంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన రీ సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిశోర్‌కుమార్ బుధవారం పరిశీలించారు. ఆయన స్థానిక సర్వే బృందంతో మాట్లాడి గ్రామకంఠం, భూముల వివరాలు, వ్యవసాయ భూములు, పట్టాభూముల వివరాల గురించి ఆరా తీశారు. నివాస స్థలాల్లోని సర్వే నంబర్లు, వాటి వివరాలు పరిశీలించారు. సర్వే పనులు పారదర్శకంగా చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ విజయ్‌కాంత్‌రావు, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్ తదితరులున్నారు.
పవిత్రమైన శ్రావణ మాసంలో వ్రతాలు, పండుగలతో ఆధ్యాత్మికత వెల్లివిరియనుంది. ఇంటింటా ప్రత్యేక పూజలతోపాటు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ మాసంలో మహిళలు మంగళవారాల్లో గౌరీపూజలు, శుక్రవారాల్లో లక్ష్మీపూజలు, శనివారాల్లో విష్ణుపూజలు చేస్తారు. శ్రావణ మొదటి సోమవారం 17న నాగులపంచమి, మొదటి మంగళవారం 18న మంగళగౌరీ వ్రతం ప్రారంభం కానుంది. 28న అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల క్షేమాన్ని కోరుకుంటూ రక్షాబంధన్ కడతారు. సెప్టెంబర్ 4న లోక రక్షణ కోసం విష్ణుమూర్తి కృష్ణుడిగా అవతరించిన పవి త్ర దినం కృష్ణాష్టమిని జరుపుకోనున్నారు. 11న పొలాల అమావాస్యతో శ్రావణం ముగియనుంది.
వ్యాపారులకు ఊరట..
దాదాపు 60రోజులుగా వివాహాలకు ముహూర్తాలు లేకపోవడంతో ప్రధానంగా పెళ్లిళ్లపై ఆధారపడి వ్యాపారాలు సాగిస్తున్న ఫంక్షన్ హాళ్లు, కల్యాణ మండపాలు, వస్త్ర, నగల దుకాణాలు వెలవెలబోయాయి. పెళ్లి తంతు నిర్వహించే పురోహితులు ఖాళీగా ఉన్నారు. ఫొటోగ్రాఫర్లు, క్యాటరింగ్, డెఒరేషన్, భోజనాల తయారీదారులు డీలా పడ్డారు. శ్రా వణ మాసం రాకతో వారికి ఊరట లభించనుంది.
ఆలయాలకు శోభ
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పవిత్రోత్సవాలు, తిరునక్షత్రాలు, భగవద్గీత పారాయణాలు, విష్ణు సహస్ర పారాయణాలు, శ్రీలలితా సహస్ర పారాయణాలు, కుంకుమ పూజలు నిర్వహించడానికి ఆలయాలు ముస్తాబు చేస్తున్నారు.
శుభముహూర్తాలు ఇవే..
ఆగస్టు 15, 16, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 30, సెప్టెంబర్ 3, 4 ,5, 8, 10 తేదీల్లో శుభముహూర్తాలున్నాయి. వివాహాలు, నిశ్చితార్థాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, అక్షరాభ్యాసాలు, విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్నారు.
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ప్రత్యేక విశిష్టత ఉంది. శ్రావణ మాసం శివునికి ప్రీతి పాత్రమైనది కావడంతో ఈ నెల రోజులు పాటు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రమే కావడంతో ఈ మాసానికి మరింత ప్రాముఖ్యత వచ్చింది. శుభాలను కలిగించే శ్రావణమాసం గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. – నిర్మల్‌చైన్‌గేట్


