‘ప్రసాద్‌’లో బాసరకు చోటేది? | - | Sakshi
Sakshi News home page

‘ప్రసాద్‌’లో బాసరకు చోటేది?

Aug 13 2026 12:03 AM | Updated on Aug 13 2026 12:03 AM

● అమ్మవారిపై కేంద్రం చిన్నచూపు ● అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు

భైంసా: దేశవ్యాప్తంగా అక్షరాభ్యాస కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు పొందిన బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్‌ పథకంలో ఇప్పటివరకు చోటు దక్కలేదు. తెలంగాణలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు నిధులు కేటాయించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ బాసరకు మొండి చేయి చూపారు. లోక్‌సభలో బీజేపీ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. స్వదేశ్‌ దర్శన్‌ కింద మహబూబ్‌నగర్‌ ఎకో టూరిజం సర్క్యూట్‌కు రూ.91.62 కోట్లు, ములుగు–లక్నవరం సర్క్యూట్‌కు రూ.79.87 కోట్లు, కుతుబ్‌షాహి హెరిటేజ్‌ పార్క్‌కు రూ.96.90 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ప్రసాద్‌ పథకం కింద అలంపూర్‌ జోగులాంబ ఆలయానికి రూ.38.90 కోట్లు, రామప్ప ఆలయానికి రూ.62 కోట్లు, భద్రాచలానికి రూ.41.38 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి బాసరకు నిత్యం అధికసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా విజయదశమి, వసంత పంచమి వంటి పర్వదినాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అక్షరాభ్యాసానికి దేశవ్యాప్తంగా పేరున్న బాసరను ప్రసాద్‌ పథకంలో చేర్చకపోవడంతో భక్తులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేలు చొరవ చూపితేనే..

బాసర ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.270 కోట్ల నిధులు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రసాద్‌ పథకం కింద కేంద్రం నిధులు అందితే బాసర అభివృద్ధి ఆలయానికే పరిమితం కాకుండా జాతీయస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశముండేది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు దేశవ్యాప్తంగా బాసర ప్రత్యేకతను మరింతగా ప్రచారం చేసే వీలుండేది. జిల్లాలో బీజేపీకి ఎంపీ, ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్న నేపథ్యంలో బాసర ప్రాధాన్యతను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రసాద్‌ పథకంలో చోటు కల్పించేలా ప్రత్యేక చొరవ చూపాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement