లోకేశ్వరం : ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కార్డుల సంఖ్యకు దుకాణాల సంఖ్య పెంచడం లేదు. కొన్ని చోట్ల పరిమితికి మించి కార్డుదారులు ఉండగా, మరికొన్ని చోట్ల బియ్యం తెచ్చుకోవడానికి దూర ప్రయాణం చేయాల్సి వస్తుండటంతో లబ్ధిదారులకు నెలనెలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లాలో 2.49 లక్షల కార్డులు..
జిల్లావ్యాప్తంగా 2,49,583 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొత్తగా 41,954 రేషన్ కార్డులను మంజూరు చేసింది. ప్రస్తుతం వాటి ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల పరిధిలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం అందజేస్తున్నారు. పలు మండలాల్లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో గోదాములు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 16 రేషన్ దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. చాలా చోట్ల సహాయకులు లేకుండానే డీలర్లు బియ్యం అందజేస్తున్నారు. దీంతో పంపిణీ ఆలస్యం అవుతోంది. దుకాణాలు పెరిగితే ప్రజల ఇబ్బందులు తగ్గడంతోపాటు సమయం కూడా ఆదా అవుతుంది.
కొత్త పంచాయతీల్లో..
జిల్లాలో గతంలో నూతన పంచాయతీలు ఏర్పాటు చేశారు. అయినా ఆయా గ్రామాల్లో కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయలేదు. పలు తండాలను పంచాయతీలుగా మార్చినా అక్కడా కొత్త షాపులు రాలేదు. దీంతో ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించి రేషన్ దుకాణాల నుంచి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. నూతన రేషన్ కార్డులతోపాటు ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
బియ్యానికే పరిమితం..
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆసరాగా ఉండాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రేషన్ దుకాణాలు కేవలం అలంకార ప్రాయంగా మారుతున్నాయి. గతంలో రేషన్ షాపుల్లో బియ్యం, కిరోసిన్, పసుపు, పప్పు, పంచదార, పామాయిల్‌తో పాటు వివిధ సరుకులను ప్రభుత్వం రాయితీ ధరలకు అందించేది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త విధానాలు అమలు చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందే సరుకులను తగ్గిస్తున్నాయి.
జిల్లా వివరాలు..
గ్రామపంచాయతీలు 400
రేషన్ దుకాణాలు 412
ఆహారభద్రతాకార్డులు 2,49,583
కొత్తగా మంజూరు చేసిన కార్డులు 41,954
అంత్యోదయ కార్డులు 13,013
అన్నపూర్ణ కార్డులు 32


